AP CID : మద్యం దుకాణాలు, తయారీ కేంద్రాల్లో ఏపీ సీఐడీ తనిఖీలు.. కారణం ఇదే..-cid inspections at liquor shops and manufacturing centers in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cid : మద్యం దుకాణాలు, తయారీ కేంద్రాల్లో ఏపీ సీఐడీ తనిఖీలు.. కారణం ఇదే..

AP CID : మద్యం దుకాణాలు, తయారీ కేంద్రాల్లో ఏపీ సీఐడీ తనిఖీలు.. కారణం ఇదే..

Basani Shiva Kumar HT Telugu
Oct 22, 2024 04:10 PM IST

AP CID : ఏపీలోని మద్యం తయారీ కేంద్రాలు, దుకాణాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ తనిఖీలు చేపట్టింది. ఏకకాలంలో.. 20 బృందాలు.. 30 చోట్ల తనిఖీలు చేపట్టాయి. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఐడీ ఉమ్మడి కృష్ణా జిల్లాపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

ఏపీ సీఐడీ
ఏపీ సీఐడీ

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఐడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మద్యం దుకాణాలు, తయారీ కేంద్రాల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 30 చోట్ల 20 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 3 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. కడపలోని ఈగల్‌ డిస్టలరీస్‌లో సీఐడీ సోదాలు చేస్తోంది.

చిత్తూరు జిల్లాలోని మద్యం తయారీ పరిశ్రమల్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. కసింకోట డీఎస్‌బీ, విశాఖ డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా చేబ్రోలులో లిక్కర్‌ పరిశ్రమలోనూ సోదాలు జరుగుతున్నాయి. మద్యం అమ్మకాల్లో అవకతవకలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఏకకాలంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

డిస్టిలరీస్‌లో ఎంత మద్యం తయారు చేశారు.. ఎంత విక్రయించారు అనే వివరాలు సేకరిస్తున్నారు. మద్యం దుకాణాల్లో.. ఎంత కొనుగోలు చేశారు కొనుగోలుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేవా అని పరిశీలిస్తున్నారు. నిల్వల్లో ఏమైనా తేడా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. కొనుగోలు లిస్ట్‌లను సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం మద్యం అమ్మకాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. మద్యం విక్రయాల్లో రూ.18 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని స్వయంగా సీఎం తెలిపారు. మద్యం విక్రయాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తామన్నారు.

నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం అక్రమంగా సరఫరా చేసినట్లు అభియోగాలు వస్తున్నాయి. మద్యం డిపోల నుంచి కాకుండా నేరుగా ఉత్పత్తి కంపెనీల నుంచే షాపులకు మద్యం బాటిళ్లను తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 13.68 కోట్ల మద్యం, బీరు బాటిళ్లకు హోలో గ్రామ్ స్టిక్కర్లకు సంబంధించి టెండర్లలోనూ అవకతవకలు జరిగినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

Whats_app_banner