Telangana Liquor : చిల్డ్ బీరులో చెత్త.. వైన్ షాపు ముందు మందుబాబుల ఆందోళన.. ఎంత కష్టం వచ్చింది!
Telangana Liquor : పండగ పూట బీరు కొంటే.. అందులో చెత్త వచ్చిందని మందుబాబులు ఆందోళనకు దిగారు. వైన్ షాపు నిర్వాహకులను అడిగితే.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగింది.
కింగ్ ఫిషర్ బీరులో నలకలు వచ్చాయని మందుబాబుల ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నర్సింహులపేటలోని శ్రీ దుర్గా వైన్ షాప్‌లో బీరు కొనుగోలు చేశామని.. అందులో చెత్త వచ్చిందని వినియోగదారులు చెప్పారు. దీనిపై షాపు నిర్వాహకులను నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. వైన్ షాప్ ముందు ఆందోళనకు దిగారు.
రికార్డు స్థాయిలో అమ్మకాలు..
అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ 1,057.42 కోట్ల మేర లిక్కర్ విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. 17.59 లక్షల బీర్ల కేసులు అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందుండగా.. తర్వాతి స్థానాల్లో కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. పండగ చివరి మూడు రోజులు భారీగా అమ్మకాలు జరిగాయి.
తెలంగాణలో 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా పబ్‌ల లోనూ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా దసరా సమయంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయి. ఈ సారి అదే అంచనాతో ముందుగానే ఎక్సైజ్ శాఖ భారీగా మద్యం నిల్వలను సిద్దం చేసింది. బార్లు, మద్యం దుకాణాలు భారీగా స్టాక్‌ను ఆర్డర్ చేశాయి. దసరా ప్రారంభానికి ముందు నుంచే అమ్మకాల్లో పెరుగుదల కనిపించింది.
శనివారం, ఆదివారం రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మొత్తంగా ఈ 11 రోజుల్లో తెలంగాణలో దాదాపు వెయ్యి కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ఖజనాకు మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది.