Telangana Liquor : మద్యం ప్రియుల జేబులు గుల్ల.. ఎక్సైజ్ అధికారులకు లిక్కర్ కిక్కు!-due to illicit liquor in telangana government revenue is decreasing ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Liquor : మద్యం ప్రియుల జేబులు గుల్ల.. ఎక్సైజ్ అధికారులకు లిక్కర్ కిక్కు!

Telangana Liquor : మద్యం ప్రియుల జేబులు గుల్ల.. ఎక్సైజ్ అధికారులకు లిక్కర్ కిక్కు!

Basani Shiva Kumar HT Telugu
Oct 22, 2024 03:28 PM IST

Telangana Liquor : ఇన్ని రోజులు తెలంగాణ మద్యం ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు వేరే రాష్ట్రాల మద్యం తెలంగాణకు వస్తోంది. కట్టడి చేయాల్సిన అధికారులు.. మామూళ్ల మత్తులో ఉన్నారు. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది. మందుబాబుల ఆరోగ్యం గుల్ల అవుతోంది.

తెలంగాణ మద్యం
తెలంగాణ మద్యం

ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఆయా రాష్ట్రాల మద్యం ఏరులై పారుతోంది. అధికారుల అక్రమాల కారణంగా బెల్టు షాపులు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుతోంది. మందుబాబుల జేబులు కూడా గుల్ల అవుతున్నాయి.

ఉదహరణకు తీసుకుంటే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 192 మద్యం దుకాణాలు ఉన్నాయి. 36 బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు ప్రభుత్వ అనుమతి ఉంది. 1,519 పంచాయతీల పరిధిలో అక్రమ మద్యం దుకాణాలను అధికారులు ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు.

ఒక్కో గ్రామానికి ఒక్కో బెల్టు షాపు ద్వారా సగటున నెలకు రూ.5 వేల చొప్పున పరిగణనలోకి తీసుకున్నా.. నెలకు రూ.75.95 లక్షలు, రెండు దుకాణాలను పరిగణనలోకి తీసుకుంటే రూ.1.50 కోట్లు అక్రమ వసూళ్లే లక్ష్యంగా అధికారుల దందా కొనసాగుతోంది.

బేల అనే మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల గ్రామాభివృద్ధి కమిటీ బెల్టు షాపు కోసం ఏకంగా వేలం నిర్వహించింది. ఏడాదికి రూ. 12 లక్షలతో ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఓ ఎక్సైజ్ అధికారి అక్కడికి వెళ్లారు. తనకు ఏడాదికి రూ.2 లక్షలు ఇవ్వాలని షరతు పెడితే గ్రామస్థులు అంగీకరించలేదు.

ఆ పంచాయితీ కాస్త మద్యం సిండికేట్‌కు చెందిన వ్యక్తి దగ్గరకు వెళ్లింది. దీంతో నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు అధికారికి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఇలా ఆ ఒక్క గ్రామంలోనే కాదు.. చాలా ఊర్లలో అదే పరిస్థితి నెలకొంది. ఇంద్రవెల్లి, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో కొంతమంది అధికారుల కనుసన్నల్లోనే బెల్టు షాపులు నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

అక్రమ మద్యం..

నిర్మల్‌ జిల్లా బేల్‌తరోడ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ద్వారా మహారాష్ట్ర నుంచి అక్రమ మద్యం సరఫరా అవుతోంది. మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నందున మన మద్యాన్ని అక్కడికి పంపిస్తూ.. అక్కడి చౌక మద్యాన్ని తెలంగాణకు పంపించే దందా సాగుతోంది. ఫలితంగా మహారాష్ట్ర మద్యంతో తెలంగాణ ఆదాయం తగ్గుతోంది.

ఇలా ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు.. మహారాష్ట్ర, ఏపీకి సరిహద్దున ఉన్న జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దు గ్రామాల్లో ఏపీ మద్యం ఏరులై పారుతోంది. చీప్ లిక్కర్‌ను అక్కడి నుంతి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.

Whats_app_banner