SEB WindUp: ఏపీ సెబ్ కథ కంచికి... పాత వ్యవస్థల పునరుద్ధరణ..ఎక్సైజ్‌లోకి మళ్లీ సిబ్బంది-end of ap seb story restoration of old systems re staffing into excise ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Seb Windup: ఏపీ సెబ్ కథ కంచికి... పాత వ్యవస్థల పునరుద్ధరణ..ఎక్సైజ్‌లోకి మళ్లీ సిబ్బంది

SEB WindUp: ఏపీ సెబ్ కథ కంచికి... పాత వ్యవస్థల పునరుద్ధరణ..ఎక్సైజ్‌లోకి మళ్లీ సిబ్బంది

Sarath chandra.B HT Telugu
Aug 20, 2024 12:56 PM IST

SEB WindUp: ఏపీలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు మంగళం పాడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఐదేళ్ల క్రితం సంపూర్ణ మద్య నిషేధం పేరుతో వైసీపీ పిల్లిమొగ్గలు సెబ్‌తో మొదలయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలింపును అడ్డుకోవడం, సారా తయారీలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన సెబ్‌ లక్ష్యాలు నెరవేరలేదు.

ఏపీలో రద్దు కానున్న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో
ఏపీలో రద్దు కానున్న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో

SEB WindUp: ఏపీలో ఐదేళ్ల క్రితం సంపూర్ణ మద్య నిషేధం లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోల ప్రహసనానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకాలని నిర్ణయించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్‌ అండ్ ప్రొహిబిషన్‌, పోలీస్ శాఖల నుంచి సిబ్బందిని కలిపి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. మొదట్లో మద్యం అక్రమ రవాణా నియంత్రణ, నాటు సారా తయారీ నిరోధం, గంజాయి సాగు, రవాణాలను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటైన సెబ్‌ను తర్వాత ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, రవాణాలకు కూడా విస్తరించారు.

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించింది. మద్యం విక్రయాలను కట్టడి చేసే పేరుతో ధరలను రెండు రెట్లు పెంచేశారు. ఆ తర్వాత కొత్త పాలసీ పేరుతో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించి ధరలను భారీగా పెంచారు. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు గోవా నుంచి మద్యం పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మద్యనిషేధం లక్ష్యంతో ఆర్బాటంగా ఏర్పాటు చేసిన సెబ్‌ వల్ల వైసీపీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. 2021 కోవిడ్ సెకండ్ వేవ్ వరకు సెబ్‌ పెట్టిన కేసులతో వేలాది మంది కేసుల పాలయ్యారు. ఆంధ్రాలో మద్యం ధరలు భారీగా పెంచడంతో ఏపీ నుంచి తెలంగాణ జిల్లాలకు వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేసేవారు. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు అటు రాయలసీమలో కూడా వేలాది మంది మద్యం కోసమే పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారు.

రైళ్లు, బస్సులు, ద్విచక్ర వాహనాల్లో పెద్ద ఎత్తున మద్యం తరలించే వారు. వ్యక్తిగత వినియోగంతో పాటు బెల్టు షాపుల్లో విక్రయం కోసం ఇలా జిల్లాలు దాటే వారు. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన సెబ్ చెక్‌పోస్టుల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇలా రెండేళ్లలో వేలాది మందిపై కేసులు నమోదులను చేశారు. ఏపీలో నాణ్యమైన మద్యం అందుబాటులో లేకపోవడం, తెలంగాణలో తక్కువ ధరకే ప్రముఖ బ్రాండ్లు విక్రయిస్తుండటంతో యువకులు తరచూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారు.

జగన్‌ ప్రభుత్వంలో చేసిన తలాతోక లేని నిర్ణయాల్లో సెబ్ ఏర్పాటు ఒకటిగా చెప్పుకోవచ్చు. మద్యం నియంత్రణ, ధరల పెంపుతో పెద్ద ఎత్తున గంజాయి, ఇతర మత్తు పదార్ధాల వినియోగం పెరిగింది. గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు అందుబాటులోకి వచ్చేశాయి. గతంలో ఎక్సైజ్‌ శాఖ పరిధిలో ఉన్నపుడు మద్యం నియంత్రణ కొంతమేరకైనా జరిగేది. ధరలు తగ్గించకుండా సెబ్‌తో మద్యం రవాణా సాధ్యం కాదనే క్లారిటీ రావడంతో చివరకు జగన్ మధ్యం ధరల్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. అప్పటికే జనంలో జరగాల్సిన డామేజ్‌ జరిగిపోయింది. మద్యం ధరలతో ప్రజల్లో వైసీపీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఇసుక, మట్టి తవ్వకాల పర్యవేక్షణ బాధ్యతల్ని కూడా సెబ్‌కు అప్పగించారు. మొత్తంగా ఈ యంత్రాంగం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మాత్రమే వ్యాపారాలు నడిచేలా సహకరించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయని కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించింది. దీంతో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నెల 28న జరిగే కేబినెట్ సమావేశంలో సెబ్ వ్యవస్థను రద్దు చేసే నిర్ణయానికి క్యాబినెట్‌లో ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత ఏపీ ఎక్సైజ్ చట్టంలో సవరణలతో ఆర్డినెన్స్ జారీ చేసి సెబ్‌ను రద్దు చేస్తారు. ఎక్సైజ్, సెబ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర స్థాయిలో బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి 15లోగా బదిలీలు పూర్తి చేసేలా ఎక్సైజ్‌ శాఖను పునర్వ్యస్థీకరిస్తారు.

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దుచేసిన తర్వాత ఎక్సైజ్‌ శాఖ ప్రధాన కార్యాలయంలో ఒక ఏసీ, ముగ్గురు జాయింట్ కమిషనర్లు ఉంటారు. మొత్తం 67 మందిని హెడ్‌ క్వార్టర్లో నియమిస్తారు. బేవరేజెస్ కార్పొరేషన్లో 36 మంది, డిస్టిలరీ విభాగంలో 302 మంది, జిల్లాల్లో 96 మంది, ఎక్సైజ్ స్టేషన్లలో మంది, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ బృందా ల్లో 295 మంది, టాస్క్ ఫోర్స్‌ బృందాల్లో 334 మందిని , చెక్ పోస్టుల్లో 313 మందిని, మద్యం డిపోల్లో 138 మంది చొప్పున సిబ్బంది నియమిస్తారు.