మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. నవంబర్‌లోనే పోలింగ్, కౌంటింగ్
Maharashtra Assembly Election : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీనితోపాటుగా ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది.
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా మహారాష్ట్రలో ఎన్నో మార్పులు జరిగాయి. దేశం మెుత్తం దృష్టి పడేలా అక్కడి రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. అయితే తర్వాతి మహారాష్ట్ర ఎన్నికల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎన్నికల సంఘం మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నవంబర్ 20న జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ మహాయుతి కూటమి అధికారంలో ఉంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ మెుత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నా్యి. నవంబర్ 26తో ఇక్కడ అసెంబ్లీ గడువు ముగియనుంది. మహారాష్ట్రలో 36 జిల్లాల్లో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇందులో 234 జనరల్ సీట్లు, 25 ఎస్టీ, 29 ఎస్సీ ఉన్నాయి.
'2024 అక్టోబర్ 15నాటికి మెుత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 4.97కోట్లు, స్త్రీలు 4.66 కోట్లు. 1.85 కోట్ల మంది 20 నుంచి 29 ఏళ్ల ఓటర్లు ఉన్నారు. అలాగే కొత్తగా 20.93 లక్షల మంది ఓటును వినియోగించుకోనున్నారు. 100186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.' అని ఎన్నికల సంఘం తెలిపింది.
మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్
మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 29వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 30న స్క్రూటీని ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 4గా నిర్ణయించారు. నవంబర్ 20న పోలింగ్ జరగ్గా.. 23వ తేదీ ఫలితాలు వెల్లడిస్తారు.
మరోవైపు ఝార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్‌తో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఝార్ఖండ్ 24 జిల్లాల్లో 81 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 44 సీట్లు జనరల్, ఎస్టీ 28, ఎస్సీ 9కి ఎన్నికలు జరగనున్నాయి. 2.6 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.31 కోట్ల పురుషులు, 1.29 కోట్ల స్త్రీలు ఓటును కలిగి ఉన్నారు. 11.84 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
ఝార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్
ఝార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ ఉండనుంది. తొలి దశ పోలింగ్‌కు సంబంధించి అక్టోబర్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్ 25వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 28న స్క్రూటీని ఉంటుంది. అక్టోబర్ 30న నామివేషన్ల ఉపసంహరణ. నవంబర్ 13న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలు వస్తాయి.
అదే విధంగా ఝార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్‌కు సంబంధించి అక్టోబర్ 22న నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 29వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 30న స్క్రూటీని ఉండనుంది. నవంబర్ 1 నామివేషన్ల ఉపసంహరణకు చివరి తేది. నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తారు.