Selfie with Jagan : జగన్‌తో సెల్ఫీ.. జైలు కానిస్టేబుల్‌కు ఛార్జ్ మెమో.. ఇదేం న్యాయం అంటున్న వైసీపీ!
Selfie with Jagan : ఆమె ఓ మహిళా కానిస్టేబుల్. గుంటూరు జిల్లా జైలులో పని చేస్తున్నారు. ఆ కానిస్టేబుల్‌కు మాజీ సీఎం జగన్ అంటే అభిమానం. ఆ అభిమానంతో.. తన కూతురుతో కలిసి జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. అది కాస్త వైరల్ అయ్యింది. శాఖాపరమైన చర్యలు తీసుకునే వరకు వెళ్లింది.
గుంటూరు జిల్లా జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందింగ సురేష్‌ను పరామర్శించేందుకు.. జగన్ మోహన్ రెడ్డి వెళ్లారు. పరామర్శించిన అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఓ జైలు కానిస్టేబుల్ అక్కడి వచ్చారు. జగన్ అంటే తనకు అభిమానం అని.. ఒక్క సెల్ఫీ తీసుకోవాలని కోరారు. అందుకు జగన్ కూడా అంగీకరించారు.
అయితే.. దీనిపై జైలు అధికారులు సీరియస్ అయినట్టు తెలిసింది. జగన్‌తో సెల్ఫీ తీసుకున్న జైలు కానిస్టేబుల్ ఆయేషాబానుకు ఛార్జ్ మెమో ఇస్తామని జైలర్ రవిబాబు స్పష్టం చేశారు. ఆయేషాబాను వివరణ ఆధారంగా కమిటీని వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్‌తో కానిస్టేబుల్ ఆయేషాబాను తన కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్న ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా చేయడంపై విమర్శలొచ్చాయి.
అయితే.. జైలు కానిస్టేబుల్‌కు ఛార్జ్ మెమో ఇస్తారన్న వార్తలపై వైసీపీ స్పందించింది. 'జగన్‌తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్‌పై కూటమి ప్రభుత్వం కక్షగట్టంది. గుంటూరు సబ్ జైలులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించి బయటికి వచ్చిన జగన్‌తో.. ఆయేషాబానుసెల్ఫీ తీసుకున్నారు. అయేషాబానుకి ఛార్జ్ మెమో ఇస్తామన్న జైలర్ రవిబాబు.. ఆమె వివరణ తర్వాత విచారణకి కమిటీ వేస్తారట. ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షసానందం' అంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితను వైసీపీ ప్రశ్నించింది.
మాజీసీఎం జగన్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 10:30 గంటలకు పిఠాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి మాధవపురం వెళ్లనున్నారు. ఏలేరు వరద బాధిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. వరద బాధితులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళతారు. అక్కడ బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.