Cyclone Fengal : తుపాను ఎఫెక్ట్- ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, అన్ని బంద్!
Cyclone Fengal live tracker : ఫెంగల్ తుపాను నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చెరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ వర్ష సూచన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బంగాళాఖాతంలో తీవ్రరూపం దాలుస్తున్న ఫెంగల్ తుపాన్ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు సైతం ప్రకటించారు. రాగల 48 గంటల్లో తుపాను బలపడి భారీ వర్షాలు, బలమైన గాలులు, తమిళనాడు తీర ప్రాంతాలు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లకు వరదలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.
ఫెంగల్ తుపాను నేపథ్యంలో వర్షాల కారణంగా పుదుచ్చేరి, కరైకల్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు, ప్రభుత్వ-ఎయిడెడ్ సంస్థలను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి హోం మంత్రి ఎ నమశివాయం ప్రకటించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం నాగపట్టణానికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు.
ఫెంగల్ తుపానుపై టాప్ 10 అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి:
- 'ఫెంగల్' తుపాను సమీపిస్తున్నందున లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు పాటించాలని తమిళనాడు అధికారులు కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా పయనించి శ్రీలంకను దాటి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
- తుపాను కారణంగా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం నాగపట్నం (300 కిలోమీటర్లు), పుదుచ్చేరి (400 కిలోమీటర్లు), చెన్నై (480 కిలోమీటర్లు) లకు ఆగ్నేయంగా ఉన్న ఈ అల్పపీడనం నవంబర్ 29న తుపానుగా బలపడే అవకాశం ఉంది.
- నవంబర్ 29, 30 తేదీల్లో ఉత్తర తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన తాజా వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. ఈ నెల 29న దక్షిణాంధ్ర, యానాం, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 30, డిసెంబర్ 1న కేరళ, మాహే, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకతో పాటు నవంబర్ 30న కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, డిసెంబర్ 1న తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- నవంబర్ 28 సాయంత్రం నుంచి నవంబర్ 29 ఉదయం వరకు నైరుతి బంగాళాఖాతంలో గంటకు 65-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
- కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. కొమోరిన్ ప్రాంతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతాల్లో గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
- రానున్న 24 గంటల్లో డెల్టా జిల్లాలు, చెంగల్పట్టు, విల్లుపురంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విల్లుపురం, కడలూరు, పుదుచ్చేరి, చెంగల్పట్టు, డెల్టా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- ఫెంగల్ తుపాను పరిస్థితుల కారణంగా మత్స్యకారులు ఈ నెల 31 వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ఫెంగల్ తుపాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారత నావికాదళం విపత్తు ప్రతిస్పందన ప్రణాళికను అమలు చేసింది.
- కడలూరులోని పాడుబడిన జెట్టీలో చిక్కుకుపోయిన ఆరుగురు మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించింది. జెట్టీలోని మరో నలుగురు కార్మికులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
- క్విక్ రెస్క్యూ కోసం స్థానిక, రాష్ట్ర అధికారుల సమన్వయంతో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్ఏడీఆర్), సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఆర్) కార్యకలాపాలపై నౌకాదళం దృష్టి సారించింది.
- ఇస్రో ఈఓఎస్-06, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో నవంబర్ 23 నుంచి ఫెంగల్ తుప్నును పర్యవేక్షిస్తూ సముద్ర గాలులు, తీవ్రత, దిశపై సవివరమైన అప్డేట్లను అందిస్తోంది.
సంబంధిత కథనం