Boat tragedy : తీవ్ర విషాదం! పడవ బోల్తా ప్రమాదంలో 27మంది మృతి- మరో 100 మంది..
200మందికి పైగా ప్రజలు ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడటంతో నైజీరియాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 27మంది మరణించారు. మరో 100మంది గల్లంతయ్యారు.
ఉత్తర నైజీరియాలో తీవ్ర విషాదం నెలకొంది! నైజర్ నది వెంబడి ఫుడ్ మార్కెట్కు వెళుతున్నా ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ జరిగింది..
కోగి రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రమైన నైజర్కు వెళుతున్న బోటు బోల్తా పడిన సమయంలో సుమారు 200 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. ఈ విషయాన్ని నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి ఇబ్రహీం ఔదు మీడియాకు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రానికి 27 మృతదేహాలను నది నుంచి బయటకు రెస్క్యూ సిబ్బంది తీయగలిగారు. ఇతరుల కోసం స్థానిక డైవర్లు గాలిస్తున్నారని కోగి స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి సాండ్రా మూసా తెలిపారు.
పడవ బోల్తా ఘటన జరిగి 12 గంటల తర్వాత ఎవరూ ప్రాణాలతో కనిపించలేదని తెలుస్తోంది.
బోటు మునిగిపోవడానికి గల కారణాలను అధికారులు ధృవీకరించలేదు. కానీ బోటు ఓవర్లోడ్ అయి ఉండవచ్చని స్థానిక మీడియా అభిప్రాయపడుతోంది. నైజీరియాలోని మారుమూల ప్రాంతాల్లో పడవలపై రద్దీ సర్వసాధారణమైన విషయం. అక్కడ మంచి రోడ్లు లేకపోవడం వల్ల చాలా మందికి బోట్లల్లో ప్రమాదకర ప్రయాణం తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు లేవు!
నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ కార్యకలాపాల ఇన్చార్జి జస్టిన్ ఉవాజురోన్యే ప్రకారం.. శుక్రవారం విషాదం సంభవించిన తర్వాత ఘటనాస్థలాన్ని కనుగొనడానికే చాలా సమయం పట్టింది! సహాయక బృందాలు ఘటనాస్థలాన్ని కనుగొనేందుకు కొన్ని గంటల పాటు శ్రమించారు.
ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో నీటి రవాణాకు భద్రతా చర్యలు, నిబంధనలను అమలు చేయడానికి అధికారులు నానా తంటాలు పడుతుండటంతో ఇలాంటి ప్రాణాంతక ఘటనలు ఎప్పటికప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు.
భద్రతా చర్యలను ధిక్కరిస్తూ వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళుతుండటం, స్థానికంగా నిర్మించిన పడవల నిర్వహణ లేకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.
అలాగే, ఇలాంటి ట్రిప్పుల్లో లైఫ్ జాకెట్ల వాడకాన్ని అధికారులు అమలు చేయలేకపోతున్నారు! ఖర్చులు ఎక్కువగా ఉండటంతో తరచుగా అవి అందుబాటులో ఉండటం లేదు.
సంబంధిత కథనం