Bapatla Boat Accident: బాపట్లలో బోటు బోల్తా.. తల్లిబిడ్డల గల్లంతు..
Bapatla Boat Accident: బాపట్ల జిల్లా నిజాంపట్నం తీరంలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడటంతో సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
Bapatla Boat Accident: పడవ బోల్తా పడటంతో తల్లితో సహా ఇద్దరు చిన్నారులు గల్లంతైన ఘటన బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఆదివారం సాయంత్రం జరిగింది. నిజాంపట్నం హార్బర్ ముఖద్వారం సమీపంలో బలమైన గాలులకు పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతయ్యారు.
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఈల చెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సముద్రంలో ఒక్కసారిగా కెరటాల ఉధృతి పెరగడంతో వీరు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది.బోటు నడుపుతున్న వారు సురక్షితంగా బయటపడగా ఈ ప్రమాదంలో సాయివర్ణిక (25)తో పాటు ఇద్దరు చిన్నారులు తనీష్ (7), తరుణేశ్వర్ (1) గల్లంతయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు కావడంలో సముద్రంలో బతికి బయటపడే అవకాశాలు లేకపోవడంతో వారి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. రోడ్డు మార్గంలో కాకుండా బోటు ద్వారా త్వరగా గమ్యాన్ని చేరుకుంటారనే ఉద్దేశంతో పడవలో ప్రయాణించి ప్రమాదం బారిన పడ్డారని చెబుతున్నారు.
ఎలాంటి ప్రాణ రక్షణ ఏర్పాట్లు లేకుండా చేపలు వేటాడే నాటు పడవలో ప్రయాణించడమే వారికి శాపమైందని చెబుతున్నారు. తీర ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఈ తరహా ప్రయాణాలు సహజమేనని మత్స్యకారులు చెబుతున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణాలకు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉండటంతో సముద్ర మార్గాలను ఆశ్రయిస్తుంటారని చెబుతున్నారు. ప్రమాదంలో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు కూడా గల్లంతవడంతో అందరిని ఆవేదనకు గురి చేసింది.