Nellore Murder Mystery : హాసిని హత్య కేసులో ఎన్నో మలుపులు.. సుపారీ హత్యగా అనుమానాలు!
Nellore Murder Mystery : నెల్లూరు జిల్లాలో ఓ హిజ్రాను అతి కిరాతకంగా చంపారు. ఈ హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. హత్య జరిగినప్పుడు గ్యాంగ్ వార్ అని పోలీసులు అనుమానించారు. కానీ.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెనక ఓ వ్యక్తి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన హిజ్రా హాసిని హత్య కేసు.. ఊహించని మలుపులు తిరుగుతోంది. హత్య జరిగిన తర్వాతి రోజే నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. కానీ పరిస్థితి మారిపోయింది. హాసినీ హత్యకు వేరే కారణాలు ఉన్నాయని, వాటిని కూడా ఛేదించాలని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
హాసినీ హత్యకు గల కారణాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. వర్గ పోరు కారణంగా హత్య జరిగిందా.. ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిందా.. మరో హిజ్రా వర్గం చేయించిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే.. ఇది సుపారీ హత్యేనని కొందరు పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. నిందితులను పట్టుకునేందుకు రెండు రోజులుగా పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరుకు చెందిన కొందరిని పిలిచి విచారించినట్లు ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తే ఈ మర్డర్‌కు ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి సుపారీ తీసుకుని హత్య చేయించినట్లు భావిస్తున్నారు. ఆ వ్యక్తికి హిజ్రాలతో పరిచయాలు ఉన్నాయని, సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలతో డాన్‌గా ఎదిగాడని నెల్లూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు అతనికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. అతని అనుచరులు రౌడీలేనని, ఏ హత్య జరిగినా.. ఆ కేసులో అతడి అనుచరులే ఉండటం ఉంటున్నారని నెల్లూరులో చర్చ జరుగుతోంది.
రెండేళ్ల కిందట ఓ యువకుడి హత్య జరిగింది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తే ఈ మర్డర్‌లోనూ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. హాసినికి, ఇతనికి గతంలోనే విబేధాలు ఉన్నాయని సమాచారం. ఈ డాన్ ఓ హిజ్రాతో సన్నిహితంగా ఉండేవాడని, అప్పుడు వీడియో తీసి హాసిని అతడిని ఇబ్బంది పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. హాసినీ అతడిని అందరి ముందు అగౌరపరిచిందని, ఆ కక్షతోనే హత్య చేయించాడని అనుమానిస్తున్నారు.
20కి పైగా కత్తిపోట్లు..
కొడవలూరు మండలం పార్లపల్లి గుడిలో పూజలు ఉన్నాయని కొందరు హిజ్రాలు హాసినీని ఆహ్వానించారు. దీంతో హాసినీ, మరో నలుగురు మంగళవారం రాత్రి కారులో వెళ్లారు. పూజల అనంతరం తిరుగి వస్తున్నారు. టపాతోపు వచ్చేసరికి రెండు కార్లు వీరి కారును అడ్డగించాయి. వెంటనే ఆ కార్లలోంచి ఆరుగురు యువకులు వచ్చి.. హాసినిపై కత్తులతో దాడిచేసి హతమార్చారు. మెడ, తల, వీపు మీద ఇరవైకి పైగా కత్తిపోట్లు ఉన్నాయి.