AP Tourism : కార్తీకమాసం స్పెషల్.. ఒకేరోజు తొమ్మిది క్షేత్రాల సందర్శన.. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తులు
AP Tourism : కార్తీకమాసంలో శైవ క్షేత్రాల సందర్శనకు భక్తులు పోటెత్తుతారు. ఏపీలో చాలాచోట్ల శివాలయాలు ఉన్నా.. కర్నూలు జిల్లాలోని దేవాలయాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకేరోజు 9 శివాలయాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయాల దర్శనం సర్వపాప హరణం అని పెద్దలు చెబుతారు. ఆ ఆలయాలు ఏంటో ఓసారి చూద్దాం.
నల్లమల అడవులు.. ప్రకృతి శోభతో అలరారుతుంటాయి. అలాంటి అందమైన అడవుల్లో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రం చుట్టుపక్కల నవనంది క్షేత్రాలు వెలిశాయి. ఈ కార్తీకమాసంలో ఆ నవనంది క్షేత్రాలను కాలినడకన దర్శించుకుంటే.. సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ నవనందులు ఏంటీ.. ఎక్కడ ఉన్నాయి.. వీటికి సంబంధించిన సమాచారం ఇదీ.
1.ప్రథమనంది
ప్రథమ నంది ఆలయం నంద్యాల పట్టణంలోని చామ కాలువ గట్టున ఉంది. భక్తులు సాక్షి గణపతిని దర్శించుకున్నాక మొదట ఈ నందీశ్వరుడిని దర్శించుకొని పూజలు చేస్తారు. కార్తీకమాసం చివరిలో అమావాస్య రోజున మహా తిరుణాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ.
2.సోమనంది
నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండు సమీపంలో ఈ ఆలయం ఉంది. భక్తులు స్వామివార్లకు పూజలు చేసుకున్నాక బండి ఆత్మకూరు మండలంలోని ఆలయాలకు బయలుదేరుతారు.
3.రుద్రనంది
ఈ నంది క్షేత్రం నంద్యాల పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బండి ఆత్మకూరు మండలం కడమలకాల్వ గ్రామానికి అతి సమీపంలో ఉంది. ఈ క్షేత్రాన్ని శివనంది, రుద్ర నందీశ్వర ఆలయంగా పిలుస్తారు. మిగతా ఎనిమిది క్షేత్రాలకంటే ఇక్కడ పెద్ద శివలింగం ఉండటం విశేషం.
4.గరుడ నంది
ఈ ఆలయం మహానంది క్షేత్రంలోనే ప్రధాన ఆలయానికి పడమటి దిశలో ఉంటుంది. ఈ స్థలంలో గరుత్మంతుడు పరమశివున్ని ధ్యానించి ఆయన రూపాన్ని ప్రతిష్ఠించారని పెద్దలు చెబుతారు. ఇక్కడ భూగృహంలో పాదం మునిగేంత నీటిలో శివలింగం ఉండటం విశేషం.
5.కృష్ణ నంది
కృష్ణ నంది క్షేత్రం నల్లమల అడవిలో ఉంది. కడమల కాల్వ నుంచి మహానంది మండల కేంద్రం తిమ్మాపురం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో కృష్ణ నంది క్షేత్రం ఉంది. ఇక్కడి కళాకృతులు భక్తులను ఆకట్టుకుంటాయి.
6.మహా నంది
మహానంది క్షేత్రంలో పరమ శివుడు గోవుపాద రూపంలో వెలిశాడు. అందుకే మహానందీశ్వరున్ని గోపాదలింగేశ్వరుడుగా పిలుస్తారు. ఈ స్వామివారి ఆలయం కిందిభాగం నుంచే అద్భుతమైన జల సంపద ఏడాది పొడువునా ప్రవహిస్తూ ప్రపంచ ఖ్యాతి గాంచింది. ఈ నీరు సుమారు 2 వేల ఎకరాల భూములను సస్యశ్యామలం చేస్తోంది.
7.వినాయక నంది
ఈ క్షేత్రం మహానంది ఆలయాల్లో అంతర్భాగంగా నిర్మితమైంది. మహానందీశ్వర స్వామివారి ఆలయానికి దక్షిణ దిశగా పరమశివుడు వినాయక నందీశ్వరునిగా వెలిశారు. ఇక్కడ వినాయకుడు తపస్సు చేసి పరమశివుడిని ప్రతిష్ఠించారని.. అందుకే ఇది వినాయకనందీశ్వర ఆలయంగా విరాజిల్లుతోందని స్థానికులు చెబుతున్నారు.
8.నాగ నంది
నాగ నంది క్షేత్రం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయానికి ఉత్తర దిశలో ఉంది. నల్లమల అడవిలోని నాగనందీశ్వరస్వామి గుడిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో.. అక్కడి శివలింగం, నందీశ్వరుడు, అమ్మవారి విగ్రహాలను ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి భక్తులు ఇక్కడికొచ్చి నాగనందీశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు.
9.సూర్య నంది
ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. మహానంది క్షేత్రం- నంద్యాల ప్రధాన రహదారి మధ్యలో తమడపల్లె గ్రామం ఉంది. అక్కడి నుంచి దక్షిణం వైపు 2 కిలో మీటర్ల దూరంలో సూర్యనంది క్షేత్రం ఉంది. ఈ ఆలయంలోని శివుడి నుదుట ఉదయాన్నే సూర్య కిరణాలు పడేవి. గుప్త నిధుల ముఠాల దాడుల వల్ల ప్రస్తుతం విగ్రహం ధ్వంసమైంది. నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.