Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు మరో అప్డేట్ - ఎల్లుండి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి- 2025 కోటా టికెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. నవంబర్ 25వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఫిబ్రవరి కోటా గదుల టికెట్లు నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. నవంబర్ 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ టికెట్లు, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ టికెట్లు, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారి వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లేదా యాప్ లో టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.
టికెట్ల సంఖ్య పెంపు:
రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ పెంచింది. 100 నుండి 200 కు పెంచినట్లు ప్రకటించింది. ఈ మేరకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు.
అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుండి 800 కు తగ్గించడం జరిగింది. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.
మరోవైపు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ను టీటీడీ ఈవో జె.శ్యామలరావు శుక్రవారం ప్రారంభించారు. పీఏసీ-3లో లాకర్ కేటాయింపునకు మూడు కౌంటర్ లను ఏర్పాటు చేశారు. భక్తులు గందరగోళానికి గురికాకుండా ఇకపై ఒకే చోట లాకర్లను కేటాయిస్తారు.
ఇక్కడ భక్తుల కోసం 1420 లాకర్లు అందుబాటులో ఉంటాయి. గదులు దొరకని భక్తులు అసౌకర్యం కలగకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. తిరుమలలో నిర్మాణంలో ఉన్న పీఏసీ-5 భవనాన్ని ఈవో పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ భవనంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి చేరుకుని డోనార్ సెల్ ను పరిశీలించారు. భక్తులు విరాళం ఇచ్చేందుకు నూతనంగా ప్రారంభించిన కియోస్క్ మిషన్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
సంబంధిత కథనం