RGV : పరారీలో రామ్ గోపాల్ వర్మ, రంగంలోకి రెండు పోలీస్ బృందాలు-హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా-controversial director ram gopal varma running away ap police searching in social media case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rgv : పరారీలో రామ్ గోపాల్ వర్మ, రంగంలోకి రెండు పోలీస్ బృందాలు-హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

RGV : పరారీలో రామ్ గోపాల్ వర్మ, రంగంలోకి రెండు పోలీస్ బృందాలు-హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Bandaru Satyaprasad HT Telugu
Nov 26, 2024 03:35 PM IST

RGV : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు ఉపశమనం దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. విచారణకు గైర్హజరైన ఆర్జీవీ కోసం పోలీసుల గాలిస్తున్నారు. ఆర్జీవీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పరారీలో రామ్ గోపాల్ వర్మ, రంగంలోకి రెండు పోలీస్ బృందాలు-హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా
పరారీలో రామ్ గోపాల్ వర్మ, రంగంలోకి రెండు పోలీస్ బృందాలు-హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఆర్జీవీ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. రెండుసార్లు విచారణకు హాజరయ్యేందుకు ఆర్జీవీకి ఒంగోలు పోలీసులు అవకాశం ఇచ్చారు. అయితే డిజిటల్ విధానంలో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించారు. రెండుసార్లు విచారణకు పిలిచినా నోటీసులను ధిక్కరించడంతో...రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆర్జీవీ ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవీని ట్రాక్ చేస్తున్నట్లు సమాచారం. తమిళనాడు, మహారాష్ట్ర, హైదరాబాద్ లో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో ఆర్జీవీ... చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పై అనుచిత పోస్టులు పెట్టారని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో తనకు ముందస్తు ఇవ్వాలని రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ముందస్తు బెయిల్ పై తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే విచారణకు హాజరుకాకపోవడంతో...ఆర్జీవీ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న అభియోగాలపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో ఆర్జీవీపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఒంగోలులో నమోదైన కేసులో విచారణకు హాజరవ్వాలని ఇప్పటికే రెండుసార్లు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. అయినా ఆర్జీవీ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడులో ఆర్జీవీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సోషల్ మీడియా అనుచిత పోస్టుల కేసును కొట్టివేయాలని ఇటీవల ఏపీ హైకోర్టులో ఆర్జీవీ క్వాష్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్జీవీని అరెస్ట్ చేసి ఒంగోలుకు తరలించే యత్నంలో పోలీసులు ఉన్నారు.

సోమవారం ఉదయం నుంచి ఆర్జీవీ, ఆయన సిబ్బంది అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. రామ్ గోపాల్ వర్మ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వర్మ డెన్ కోసం వెళ్లారు ఏపీ పోలీసులు. ఆయన ఇంట్లో లేరని తెలుసుకున్న పోలీసులు గాలింపుచేపట్టారు. ఆర్జీవీ తన రెండు ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. శంషాబాద్‌, షాద్ నగర్ లోని ఫాంహౌస్‌లో ఆర్జీవీ తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా... అక్కడ లేరని తెలుసుకుని వెనుదిరిగారు.

Whats_app_banner

సంబంధిత కథనం