Pawan Kalyan : అదానీ వ్యవహారంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం : పవన్
Pawan Kalyan : అదానీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీతో బుధవారం భేటీ కానున్నారు.
అదానీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ స్పందించారు. అదానీ ఇష్యూపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో సమోసాల కోసం రూ. 9 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. హోంశాఖ, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని స్పష్టం చేశారు.
'గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులు వాడలేదు. జల్‌జీవన్ బడ్జెట్ పెంచాలని కేంద్రాన్ని కోరా. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో.. నిధులు వినియోగించలేదు. గత ప్రభుత్వ తప్పిదాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం. రేపు ప్రధాని మోదీని కలుస్తా. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తా' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. కాసేపటి కిందటే కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌తో పవన్ భేటీ అయ్యారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను పవన్ కలవనున్నారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌తో.. అనంతరం లలన్ సింగ్‌తో పవన్ సమావేశం కానున్నారు. రేపు పార్లమెంట్‌లో ప్రధాని మోడీతో డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు.
సోమవారం పర్యాటక శాఖపై పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వారసత్వ ప్రాంతాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడేలా అవగాహన చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యాటక రంగం అభివృద్ది చేయడం వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.