Carrot Ginger Soup Recipe: చలికాలంలో ఎంతో మేలు చేసే ‘క్యారెట్ అల్లం సూప్’.. సింపుల్‍గా ఇలా చేసుకోండి.. వెచ్చదనం, ఆరోగ్యం-make this carrot ginger soup in this way immunity booster for this winter follow the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Ginger Soup Recipe: చలికాలంలో ఎంతో మేలు చేసే ‘క్యారెట్ అల్లం సూప్’.. సింపుల్‍గా ఇలా చేసుకోండి.. వెచ్చదనం, ఆరోగ్యం

Carrot Ginger Soup Recipe: చలికాలంలో ఎంతో మేలు చేసే ‘క్యారెట్ అల్లం సూప్’.. సింపుల్‍గా ఇలా చేసుకోండి.. వెచ్చదనం, ఆరోగ్యం

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 26, 2024 03:30 PM IST

Carrot Ginger Soup Recipe: క్యారెట్ అల్లం సూప్ ఇంట్లోనే సింపుల్‍గా తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శీతాకాలంలో శరీరానికి వెచ్చదనం కూడా ఇస్తుంది. టేస్ట్ కూడా ఘాటుగా బాగుంటుంది.

Carrot Ginger Soup Recipe: చలికాలంలో ఎంతో మేలు చేసే ‘క్యారెట్ అల్లం సూప్’.. సింపుల్‍గా ఇలా చేసుకోండి.. వెచ్చదనం, ఆరోగ్యం (Photo: Freepik)
Carrot Ginger Soup Recipe: చలికాలంలో ఎంతో మేలు చేసే ‘క్యారెట్ అల్లం సూప్’.. సింపుల్‍గా ఇలా చేసుకోండి.. వెచ్చదనం, ఆరోగ్యం (Photo: Freepik)

చల్లటి వాతావరం ఉండే శీతాకాలంలో వెచ్చగా ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది. అందుకే ఈ కాలంలో సూప్‍లు బెస్ట్ ఆప్షన్లుగా ఉంటాయి. సూప్‍లు శరీరంలో వెచ్చదానాన్ని పెంచుతాయి. చలి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే పోషకాలు ఉండే వాటితో సూప్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అలాంటిదే ‘క్యారెట్ అల్లం సూప్’. ఇది వెచ్చదనంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

క్యారెట్ అల్లం సూప్‍ను ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. కొన్ని పదార్థాలతోనే సింపుల్‍గా చేసేసుకోవచ్చు. వెచ్చగా, ఘాటుగా, మంచి రుచితో ఉంటుంది. క్యారెట్ అల్లం సూప్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

క్యారెట్ అల్లం సూప్‍కు కావాల్సిన పదార్థాలు

  • 400 గ్రాముల క్యారెట్ (కడిగి గుడ్రంగా సన్నగా తరగాలి)
  • ఓ ఇంచు అల్లం (చిన్న ముక్కలుగా తరగాలి)
  • 6 వెల్లుల్లి రెబ్బలు
  • ఓ బిర్యానీ ఆకు
  • ఓ టీస్పూన్ మిరియాలు
  • ఓ ఉల్లిపాయ తరుగు
  • ఓ టేబుల్‍ స్పూన్ వంట నూనె
  • రుచికి తగినంత ఉప్పు
  • లీటర్ నీరు

క్యారెట్ అల్లం సూప్‍ తయారీ విధానం

  1. ముందుగా స్టవ్‍పై ఓ ప్యాన్ పెట్టుకొని నూనె పోయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, వెల్లుల్లి, మిరియాలు, అల్లం ముక్కలు వేసి వేపాలి.
  2. సుమారు రెండు నిమిషాల పాటు వాటిని వేగనివ్వాలి.
  3. దాంట్లో తరిగిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వెంటనే అర లీటర్ వరకు నీరు దాంట్లో పోయాలి.
  4. క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మీడియం మంటపై ఉడికించుకోవాలి. ప్యాన్‍పై మూత పెట్టాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి.
  5. క్యారెట్ ముక్కలు పూర్తిగా ఉడికాక.. ఆ మిశ్రమాన్నంతా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీన్ని మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
  6. మెత్తగా ప్యూరీలా అయిన ఆ మిశ్రమాన్ని స్టెయినర్‌లో వేసి.. దాంట్లోనే అరలీటర్ నీరు పోసి కింద పెట్టుకున్న గిన్నెలో సూప్ పడేలా గరిటతో వత్తాలి. ఇలా నీటితో స్ట్రైనర్‌లో ప్యూరీని వడగితే పిప్పి నిలిచి.. సూప్ కింద గిన్నెలో దిగుతుంది.
  7. ఆ తర్వాత సూప్‍ను మళ్లీ ఓ ప్యాన్‍లో పోసుకొని స్టవ్‍పై బాగా మరిగించాలి. అప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సూప్ బాగా మరిగాక స్టవ్ ఆపేసి ప్యాన్ దించేలి. అంతే క్యారెట్ అల్లం సూప్ రెడీ అవుతుంది.

కాస్త తియ్యగా, ఘూటుగా ఈ క్యారెట్ అల్లం సూప్ అదిరిపోతుంది. అయితే, ఘూటు తక్కువగా ఉండాలనుకునే వారు అల్లం, మిరియాలు కాస్త తక్కువ వేసుకోవచ్చు. వేడివేడిగా ఈ సూప్ తాగితే అద్భుతంగా అనిపిస్తుంది.

ఈ సూప్ ఆరోగ్య ప్రయోజనాలు

క్యారెట్ అల్లం సూప్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. క్యారెట్‍, అల్లంలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఇమ్యూనిటీని ఇవి పెంచుతాయి. శీతాకాలంలో జలుబు, దగ్గు నుంచి ఇది కాస్త ఉపశమనం కలిగించగలదు. శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తి పెరిగేందుకు కూడా సహకరిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా రెగ్యులర్‌గా ఈ సూప్ తాగొచ్చు.

Whats_app_banner