Jaya Jayahe Telangana : రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ఆమోదం - 2 వర్షన్లలో పాట, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన-cm revanth reddy announced that jaya jaya he telangana song will be released on 2nd june ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jaya Jayahe Telangana : రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ఆమోదం - 2 వర్షన్లలో పాట, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Jaya Jayahe Telangana : రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ఆమోదం - 2 వర్షన్లలో పాట, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
May 30, 2024 10:04 PM IST

CM Revanth On Jaya Jayahe Telangana Song : ’జయ జయహే తెలంగాణ’ గేయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. జూన్ 2వ తేదీన పాటను జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy News : ’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు.

ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ ఇరవై ఏండ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా అమోదించినట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చారు.

సచివాలయంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి  సమీక్షించారు.ఇందుకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు ముఖ్యులు హాజరయ్యారు.  ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి ఇందులో పాల్గొన్నారు.

దశాబ్ధి ముగింపు వేడుకలపై చర్చ….

తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రెండు వర్షన్లలో తయారు చేశారు. 2.30 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ రూపొందించారు. 

ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గేయం ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయనీ గాయకుల బృందం ఆలపించిన ఈ గీతం అందరినీ అలరించింది.

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్ ను టీజీగా మార్చినట్లు సీఎం తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు టీజీగా మార్పు చేశామన్నారు. కేబినేట్ లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించటం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు.

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు సీఎం చెప్పారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయమేది జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.  కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.

ఘనంగా వేడుకలు…. కార్యక్రమాల వివరాలివే

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు.

  • జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు.
  • ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పేరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది.
  • తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.
  • అనంతరం శ్రీమతి సోనియాగాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
  • పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.
  • జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు.
  • సాయంత్రం 6.30కు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు.
  • అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.
  • అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
  • స్టేజ్​ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్​ బండ్​పై ఇటు చివర నుంచి అటు చివరి వారకు భారీ ఫ్లాగ్​ వాక్​ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్​ వాక్​ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్​ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు.
  • అదే వేదికపై తెలంగాణ కవి శ్రీ అందెశ్రీ, సంగీత దర్శకుడు శ్రీ ఎం.ఎం. కీరవాణికి సన్మానం చేస్తారు.
  • రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా (ఫైర్వర్క్స్) కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.

Whats_app_banner