KTR Charminar Visit: చార్‌మినార్‌ తొలగింపు హైదరాబాద్‌ను అవమానించడమేనన్న కేటీఆర్, రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం-ktr says removal of charminar in logo is an insult to hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Charminar Visit: చార్‌మినార్‌ తొలగింపు హైదరాబాద్‌ను అవమానించడమేనన్న కేటీఆర్, రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం

KTR Charminar Visit: చార్‌మినార్‌ తొలగింపు హైదరాబాద్‌ను అవమానించడమేనన్న కేటీఆర్, రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం

Sarath chandra.B HT Telugu
May 30, 2024 01:11 PM IST

KTR Charminar Visit: తెలంగాణ అధికారిక చిహ్నంలో చార్‌మినార్‌ను తొలగించాలనే నిర్ణయంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచరులు, బిఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి చార్‌మినార్‌ను సందర్శించారు.

అధికారిక చిహ్నంలో చార్‌మినార్ తొలగించాలనే నిర్ణయంపై కేటీఆర్ ఆగ్రహం
అధికారిక చిహ్నంలో చార్‌మినార్ తొలగించాలనే నిర్ణయంపై కేటీఆర్ ఆగ్రహం

KTR Charminar Visit: తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చార్‌మినార్‌ను తొలగించాలనే నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి చార్మినార్ ను సందర్శించారు.

గత పదేళ్లలో ప్రభుత్వంలో మంచి జరిగితే దాని గురించి ప్రజలకు చెప్పాలని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత పదేళ్లలో జరిగిన మంచిని, అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ దుగ్ద, కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

పదేళ్లలో ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాల్సి ఉందని, పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా మూర్ఖ, మొండి వైఖరితో కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు.

కేసీఆర్‌కు పేరు రావొద్దొని, కేసీఆర్ గారి పేరు వినబడవద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ అనగానే హైదరాబాద్, వరంగల్ గుర్తొస్తాయని, కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణం అన్నారు.

తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చార్మినార్ ను తొలగించటమంటే ప్రతి హైదరాబాదీని అవమానపర్చినట్టేనని ప్రతి ఒక్కరిని అగౌరవపరిచినట్టేనన్నారు.

మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల బతుకులు మార్చమని, మేలు చేయమని, పథకాలు అమలుచేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని విజ్ఞప్తి చేశారు. చిహ్నాల మార్పు వంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోవాలని ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించకండని డిమాండ్ చేశారు.

తెలంగాణ షాన్ హైదరాబాద్ నగరమని, హైదరాబాద్ ప్రతీక చార్మినార్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే దాని ప్రతీక చార్మినార్ అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, తెలంగాణ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. వీటిని ఇప్పుడు తీసేయాల్సిన అవసరం, అర్జెన్సీ ఏమీ వచ్చిందన్నారు.

కాంగ్రెస్‌ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. హైదరాబాద్ కు 400ఏళ్లు పూర్తైనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఘనంగా ఉత్సవాలు నిర్వహించిందని, అప్పుడు ఉత్సవాలు నిర్వహించిన కాంగ్రెస్ కు ఇప్పుడేమైందో చెప్పాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మూర్ఖపు వైఖరి మానుకోవాలన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024