BRS Protest: తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం తొలగింపు! భగ్గుమంటున్న బీఆర్​ఎస్​ నేతలు-removal of kakatiya kalatorana in telangana rajmudra the brs leaders are divided ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Protest: తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం తొలగింపు! భగ్గుమంటున్న బీఆర్​ఎస్​ నేతలు

BRS Protest: తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం తొలగింపు! భగ్గుమంటున్న బీఆర్​ఎస్​ నేతలు

HT Telugu Desk HT Telugu
May 30, 2024 12:38 PM IST

BRS Protest: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్​ ను తొలగించే విషయం హాట్​ టాపిక్​ గా మారింది.

శిలా తోరణం వద్ద బిఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన
శిలా తోరణం వద్ద బిఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన

BRS Protest: రాష్ట్ర అధికార చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఉద్యమకారులతో చర్చించి నిర్ణయం తీసుకోగా.. ఇప్పటికే కొత్త రాజముద్ర పై కసరత్తు కూడా పూర్తయింది.

అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తొలగించడంపై ఓరుగల్లు జిల్లాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్​ఎస్​ పార్టీ నేతలు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఓరుగల్లు సంస్కృతిని ప్రతిబింబించే కళాతోరణం తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. లేని పక్షంలో మరో ఉద్యమం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

రాచరిక ఆనవాళ్లు ఉన్నాయనే..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం చార్మినార్​, కాకతీయ కళాతోరణాలతో రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించింది. కాగా అందులో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని, అందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్​ రెడ్డి పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ మేరకు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులతో సమావేశమై అధికార చిహ్నంపై పలుమార్లు చర్చలు జరిపారు. 1969లో తొలి దశ ఉద్యమం జరగగా, ఆనాటి ఆనవాళ్లు, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా అధికార చిహ్నం ఉండాలని తీర్మానించారు. ఈ మేరకు రాజముద్రలో మార్పులు, చేర్పులపై చిత్ర కారుడు రుద్ర రాజేశంతో చర్చించి, రాష్ట్ర అధికారిక చిహ్నానికి తుది రూపు తీసుకొచ్చారు.

రాజముద్రలో మార్పులు, చేర్పులపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్​ రెడ్డి గురువారం సాయంత్రం వివిధ పార్టీల నేతలతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. వారి వారి అభిప్రాయాలను సేకరించి, రాష్ట్ర చిహ్నాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో మార్పుల తరువాత జూన్​ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అధికార చిహ్నాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మండిపడుతున్న బీఆర్​ఎస్​

కాకతీయ తోరణంలో కాకతీయుల పాలనా వైభవం ఉట్టిపడుతుంది. ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెప్పే నాలుగు పిల్లర్లు, చివరి రెండు పిల్లర్ల మీద ఇరుపక్కల గర్జించిన సింహాలు కాకతీయుల ఎదురులేని నాయకత్వానికి చిహ్నం. దాని పక్కన తల పైకెత్తిన మొసలి జలకళకు, రెండు హంసలు కాకతీయుల పారదర్శక పాలనకు, హంస కింద ఇరువైపుల చేతులు పైకెత్తిన కుబేరుల విగ్రహాలు ఆర్థిక పరిపుష్టికి, మొసలి కింది భాగంలో వజ్ర వైఢూర్యాల దండలు కాకతీయుల వైభవానికి, కిందిభాగాన బోర్లించిన ఏడు పూర్ణ కుంభాలు గ్రామ దేవతలకు ప్రతిబింబాలని చరిత్రకారులు చెబుతున్నారు.

కాకతీయుల కాలం నాటి వివిధ అంశాలను ప్రతిబింబించే చిహ్నాన్ని బీఆర్​ఎస్​ ప్రభుత్వం రాజముద్రలో పొందుపరించింది. కాగా సమ్మక్క సారలమ్మలపై యుద్ధం చేసి, కాకతీయులు రాచరికాన్ని ప్రదర్శించారని, రాజముద్రలో అవే ఆనవాళ్లు కనపడుతున్నాయని సీఎం అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు అధికార చిహ్నంలో మార్పులు చేయగా, బీఆర్​ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు వరంగల్​ లో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

బీఆర్​ఎస్​ నేతలపై కేసు

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం సాయంత్రం ఖిలా వరంగల్ లో బీఆర్​ఎస్​ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల నేతలు పాల్గొని మీటింగ్​ నిర్వహించారు. మాజీ ఎంపీ వినోద్​ కుమార్​, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్​, దాస్యం వినయ్​ బాస్కర్​, పెద్ది సుదర్శన్​ రెడ్డి, నాయకులు ఏనుగుల రాకేశ్​ రెడ్డి, మరుపల్ల రవి తదితరులు హాజరై నిరసన వ్యక్తం చేశారు.

కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై హై కోర్టును కూడా ఆశ్రయిస్తామని వినోద్​ కుమార్ తెలిపారు. కాగా గురువారం కూడా బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో సమావేశాలు కొనసాగాయి. ఇదిలాఉంటే ఖిలా వరంగల్‌లోని కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఆ పార్టీ నేతలు వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సహా మరో ఏడుగురిపై ఎన్నికల కమిషన్​ ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఎలక్షన్​ కోడ్​ అమలులో ఉన్నప్పటికీ ముందస్తు పర్మిషన్​ లేకుండా అంత మంది ఒకేచోట గుమికూడి మీటింగ్​ నిర్వహించడంతో మిల్స్ కాలనీ స్టేషన్​ లో రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే అధికార చిహ్నంపై మార్పుల విషయంలో బీఆర్​ఎస్​ నేతలు ఆందోళనలు చేపడుతుండగా, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేనిపక్షంలో రాష్ట్రంలో కీలకమైన ఓరుగల్లు సంస్కృతిని ప్రతిబింబించేలా చిహ్నాన్ని రూపొందించాలని డిమాండ్​ చేస్తున్నారు.

న్యాయపోరాటం చేస్తాం…

తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి శిలాతోరణం తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తామని బిఆర్‌ఎస్‌ నాయకుడు వినోద్‌ కుమార్ ప్రకటించారు. సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని, కేంద్ర ప్రభుత్వ గెజిట్‌తో అమోదం పొందిన తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకుంటామన్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం