CM Revanth Reddy : ఏపీ కొత్త ముఖ్యమంత్రిని కలుస్తా..! సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy Visits Tirumala: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కొత్త సీఎంను కలుస్తానని చెప్పారు.
CM Revanth Reddy Visits Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన…. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్పారు.

ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేవలం తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఉపయోగపడేలా ఈ సత్రాన్ని నిర్మిస్తామని చెప్పుకొచ్చారు.
గతేడాది కరువు ఉన్నప్పటికీ ఈ ఏడాది సకాలంలో వర్షాలు పుడుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. రుతుపవనాలు రాక సకాలంలో ఉందని… ఈ ఏడాది సమవృద్ధిగా వర్షాలు పడి, పంటల పండాలని శ్రీవారిని కోరుకున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు.బుధవారం వేకువ జామున రేవంత్ రెడ్డి మనుమడికి పుట్టు వెంట్రుకలు సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు ఏపీలో వైసీపీ సర్కార్ ఉంది. అయితే ఇరువురు ముఖ్యమంత్రి కలిసిన సందర్భం లేదు. పైగా ఏపీలో ఎన్నికల ప్రకటన రావటంతో…. ప్రచారం హడావిడి మొదలైంది. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి… సీఎం జగన్ కనీసం అభినందనలు కూడా చెప్పలేదన్న వార్తలు కూడా వినిపించాయి.
మరోవైపు ఏపీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు జగన్. కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన…. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు ఏజెంట్ అని ఆరోపించారు. వైసీపీ ఓట్లను చీల్చేందుకు షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీని రంగ ప్రవేశం చేయించారని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా…. ఈ ఎన్నికల్లో తమదే విజయమని చెప్పుకొచ్చారు.
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా…. సత్ససంబంధాలనే కోరుకుంటున్నామని రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. ఇరు రాష్ట్రాలు కూడా అభివృద్ధిపథంలో నడవాలని ఆకాంక్షించారు. అయితే జూన్ 3వ తేదీన వెలువడే ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ గెలవబోతుందనేది తేలబోతుంది…!