Sainik School Admissions : సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 8 పరీక్షా కేంద్రాలు
Sainik School Admissions : సైనిక్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలకు.. ఏపీ, తెలంగాణల్లో ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధప్రదేశ్‌లోని రెండు సైనిక్ స్కూల్స్‌తో సహా.. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు డిసెంబర్ 20న ఆఖరు తేదీ. ప్రవేశ పరీక్ష జనవరి 28న నిర్వహిస్తారు. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://exams.nta.ac.in/AISSEE/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరణ పత్రాలు, స్టూడెంట్ ఫోటో, సంతకం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు..
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణంలో హైదరాబాద్, కరీంనగర్‌లో ఉన్నాయి. ఆరో తరగతిలో చేరే వారికి ప్రవేశ పరీక్ష గుర్తింపు పొందిన అన్ని ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. 300 మార్కులతో జరిగే ఈ పరీక్షకు సమయం రెండున్నర గంటలు ఉంటుంది. తొమ్మిదో తరగతిలో చేరే వారికి మాత్రం ప్రవేశ పరీక్ష కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. 400 మార్కులతో జరిగే ఈ పరీక్షకు సమయం మూడు గంటలు ఉంటుంది. రాత పరీక్షల్లో అర్హత (40 శాతం మార్కులు) సాధించిన వారికి 1:3 నిష్పత్తిలో మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు.
ఏపీలో..
ఆంధ్రప్రదేశ్‌లో రెండు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ఒకటి విజయనగరం జిల్లా కోరుకొండలో ఉండగా, మరొకటి అన్నమయ్య జిల్లా కలికిరిలో ఉంది. కోరుకొండలో 1962 జనవరి 18న సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయగా, కలికిరిలో 2014 ఆగస్టు 20న సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశారు.
అప్లికేషన్ ఫీజు..
జనరల్, డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులకు రూ.650, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.500 ఉంటుంది. ఈ పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
అర్హతలు..
ఆరో తరగతిలో బాలబాలికలకు ప్రవేశం, తొమ్మిదో తరగతిలో బాలురకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఆరో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులు 2013 ఏప్రిల్ 1 నుంచి 2015 మార్చి 31 మధ్య పుట్టి ఉండాలి. వారి వయస్సు 10 నుంచి 12 ఏళ్లు ఉండాలి. తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులు 2010 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 మధ్య పుట్టి ఉండాలి. 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
అప్‌లోడ్ చేయాల్సినవి..
1. బర్త్ సర్టిఫికేట్
2. కుల ధ్రువీకరణ పత్రం
3. నివాస ధ్రువీకరణ పత్రం
4, సైనిక ఉద్యోగుల పిల్లలకు సర్వీసు ధ్రువీకరణ పత్రం
5. మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు పీపీవో
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)