TGPSC Groups Results : గ్రూప్ 1, 2, 3 ఫలితాలపై టీజీపీఎస్సీ కసరత్తు - మార్చి ఆఖరులోగా తుది ఫలితాలు..!-telangana group exam results to be announced in march 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tgpsc Groups Results : గ్రూప్ 1, 2, 3 ఫలితాలపై టీజీపీఎస్సీ కసరత్తు - మార్చి ఆఖరులోగా తుది ఫలితాలు..!

TGPSC Groups Results : గ్రూప్ 1, 2, 3 ఫలితాలపై టీజీపీఎస్సీ కసరత్తు - మార్చి ఆఖరులోగా తుది ఫలితాలు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 15, 2024 01:05 PM IST

TGPSC Group Exams Result Updates : ఉద్యోగాల భర్తీపై టీజీపీఎస్సీ దృష్టి పెట్టింది. రాత పరీక్షలతో పాటు ఫలితాల విడుదలను వేగవంతం చేయాలని చూస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రూప్ 1, 3 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సాధ్యమైనంత త్వరగా గ్రూప్ 2 ఫలితాలను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

తెలంగాణ గ్రూప్ ఫలితాలు
తెలంగాణ గ్రూప్ ఫలితాలు

గ్రూప్స్ పరీక్షల ఫలితాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టి పెట్టింది. త్వరలోనే గ్రూప్ 1, 3 పరీక్షల ఫలితాలను ప్రకటించాలని యోచిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 4 ప్రక్రియను పూర్తి చేసింది. మరోవైపు కీలకమైన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం నడుస్తోంది. ఇదిలా ఉంటే రేపటితో గ్రూప్ 2 పరీక్షలు కూడా పూర్తి కానున్నాయి.

గ్రూప్ పరీక్షల ఫలితాలపై తాజాగా టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు గ్రూప్ 1 తుది ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను వెల్లడిస్తామన్నారు. అయితే ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం చివరి దశకు చేరింది. ఇక త్వరలోనే గ్రూప్ 3 పరీక్షల కీలను ప్రకటించే అవకాశం ఉంది. అభ్యంతరాలను స్వీకరించి తుది ఫలితాలను వెల్లడించాలని టీజీపీఎస్సీ భావిస్తోంది.

గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… ఫలితాలపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. నవంబర్ మాసంలోనే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా ప్రారంభించింది. మూల్యాంకనం పూర్తి కాగానే… మెరిట్ జాబితాను సిద్ధం చేయనుంది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది. అయితే గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత మిగతా పరీక్షల తుది ఫలితాలను ఇవ్వాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాతనే గ్రూప్ 3, గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ భావిస్తోంది. గ్రూప్ 1 ఫలితాలు కాకుండా గ్రూప్ 3, 2 ఫలితాలను ప్రకటిస్తే కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కిందిస్థాయి పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇటీవలే గురుకుల నియామాకాల్లో కూడా ఇదే జరిగింది. ఈ పరిణామాలను అంచనా వేస్తున్న టీజీపీఎస్సీ…. ముందుగా గ్రూప్ 1 ఫలితాలను ప్రకటించనున్నారు. ఆ తర్వాత గ్రూప్ 2, 3 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

గ్రూప్ 1 తుది ఫలితాలను ఫిబ్రవరి 20వ తేదీలోపే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపటితో గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా పూర్తి కానున్నాయి. సాధ్యమైనంత త్వరగా కీలను అందుబాటులోకి తీసుకొచ్చి… అభ్యంతరాలను స్వీకరించాలని టీజీపీఎస్సీ చూస్తోంది. ఆ వెంటనే వరుసగా గ్రూప్ 1, 2, 3 ఫలితాలను ప్రకటించాలని భావిస్తోంది. మొత్తంగా చూస్తే మార్చి నెలఖారు నాటికి కీలకమైన గ్రూప్ 1, 2,3 ఫలితాలన్నీ విడుదలయ్యే అవకాశం ఉంది…!

Whats_app_banner

సంబంధిత కథనం