Telangana Revenue System : తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ....! పునరుద్ధరణే మార్గమా..?
Telangana VRO VRA System: తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థలో మళ్లీ మార్పులు రాబోతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి రాబోతుంది. ఇదిలా ఉంటే… తిరిగి వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను పునరుద్ధరించేందకు సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను 2020 సెప్టెంబర్ లో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా 7,039 వీఆర్వో పోస్టులు రద్దయ్యాయి. అప్పట్నుంచి… గ్రామస్థాయిలో భూ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేకంగా అంటూ సిబ్బంది ఎవరూ లేరు. ప్రతిది తహశీల్దార్ కార్యాలయమే పర్యవేక్షిస్తూ వస్తోంది.
వీఆర్వోలు పెద్దఎత్తున లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల తారుమారుకు కూడా వీఆర్వోలే ప్రధాన బాధ్యులని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన జరగాలంటే వీఆర్వో వ్యవస్థ ఉండరాదన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. అయితే సర్కార్ నిర్ణయంపై వీఆర్వోలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ... చివరికి వెనక్కి తగ్గారు. వీరందర్నీ… పలు శాఖల్లోకి కూడా సర్దుబాటు చేసింది.
వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థల రద్దుతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఏదైనా భూసమస్య లేదా ఇతర అంశాలకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే… తప్పనిసరిగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. గతంలో వీఆర్వోలకు ఫిర్యాదు చేయటం లేదా వారి దృష్టికి తీసుకెళ్తే… సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడేవి. లేదా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లేది. ప్రస్తుతం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలు లేకపోవటంతో…. స్థానికంగా ఉండే వాళ్లు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే ధరణి ఆన్ లైన్ సేవలు వచ్చిన తర్వాత… చాలా సేవలు ఆన్ లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. తద్వారా చాలా అంశాల్లో ప్రజలకు ఇబ్బందులు తగ్గినప్పటికీ… కొన్నింటిపరంగా ఇబ్బందులు తప్పటం లేదు..!
పునరుద్ధరణ దిశగా అడుగులు…!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ నిర్ణయాలను పునసమీక్షిస్తోంది. ఇందులో భాగంగా.. కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకురానుంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ముసాయిదా బిల్లును సిద్ధం చేసి…. ప్రజాభిప్రాయాలను కూడా సేకరించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే…. కొత్త ఆర్వోఆర్(‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్-2024’) ముసాయిదాను ప్రవేశపెట్టి చట్టంగా మార్చే పనిలో ఉంది.
ఈ ముసాయిదా ప్రకారం….. తహసీల్దార్లతోపాటు ఆర్డీవోలకూ మ్యుటేషన్ చేసే అధికారం ఇవ్వనుంది. మ్యుటేషన్ సమయంలో విచారణకు అవకాశం కల్పిస్తుండగా… తప్పుగా తేలితే మ్యుటేషన్ నిలిపివేసే అధికారాలను కట్టబెట్టనుంది. ప్రతి భూకమతానికి భూ ఆధార్ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. అప్పీల్, రివిజన్‌లకు వెసులుబాటు కల్పిస్తూ బిల్లును రూపొందించారు.
ఈ ముసాయిదా బిల్లు పేర్కొన్న వివరాల ప్రకారం….. ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూదార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే చేసిన తర్వాత శాశ్వత భూదార్ కేటాయిస్తారు. 2020లో తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్ట ప్రకారం… చాలా ఇబ్బందులు ఉన్నాయి.
అప్పీల్, రివిజన్ వ్యవస్థలు లేకపోవటంతో భూ యజమానులకు అనేక సమస్యలు ఏర్పడ్డాయి. కలెక్టర్లకు ఎక్కువ అధికారాలు ఉండటంతో క్షేత్రస్థాయిలోని అధికారులు ఏం చేయలేని పరిస్థితి ఉండేది. అయితే కొత్త చట్టంలో మూడంచెల అప్పిలేట్ అథారిటీలను నియమించనున్నారు. తహసీల్దారు, ఆర్డీవోల మ్యుటేషన్లపై అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చట్టానికి సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.
మరోవైపు వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను కూడా పునరుద్ధరించాలని సర్కార్ నిర్ణయించింది. ఇదే విషయంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలుమార్లు కీలక ప్రకటనలు చేశారు. వచ్చే సంక్రాంతి లోపు రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని చెప్పుకొచ్చారు. దీని ద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కరంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని సర్కార్ గుర్తించింది. వీఆర్వోలు, వీఆర్ఏ లు లేకపోవటంతో… ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయని భావిస్తోంది. రెవెన్యూ రికార్డుల నిర్వహణలో కూడా క్షేత్రస్థాయిలో అధికారులు లేకపోవటం పెద్ద సమస్యగా మారుతోందని గుర్తించింది. ఈ క్రమంలోనే… తిరిగి పాత రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధించాలని యోచిస్తోంది. తద్వారా ప్రజలకు ఉండే ఇబ్బందుల పరిష్కారం సులవుగా అవుతుందని భావిస్తోంది. ఇందుకు సంబంధించి వచ్చే జనవరిలో కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. పునరుద్ధరణలో భాగంగా కేవలం వీఆర్వోలు మాత్రమే ఉంటారా..? వీఆర్ఏలను కూడా తీసుకువస్తుందా..? అనేది చూడాలి…!
సంబంధిత కథనం