Telugu Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెనాలి యువతి మృతి, శోకసంద్రంలో కుటుంబం-ap guntur student dies in road accident in america ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Telugu Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెనాలి యువతి మృతి, శోకసంద్రంలో కుటుంబం

Telugu Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెనాలి యువతి మృతి, శోకసంద్రంలో కుటుంబం

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 15, 2024 11:22 AM IST

Telugu Student Died in USA: అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో తెనాలికి చెందిన యువ‌తి మృతి చెందింది. ఆ యువ‌తి మృత దేహాన్ని స్వ‌గ్రామానికి పంపించేందుకు తానా ప్ర‌తినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్తె మృతి చెంద‌డంపై త‌ల్లిదండ్రులు విల‌పిస్తున్నారు.

నాగ‌శ్రీ వంద‌న ప‌రిమ‌ళ (26)
నాగ‌శ్రీ వంద‌న ప‌రిమ‌ళ (26)

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గ‌ణేష్‌, ర‌మాదేవి దంప‌తుల కుమార్తె నాగ‌శ్రీ వంద‌న ప‌రిమ‌ళ (26) ఉన్న‌త చ‌దువుల కోసం 2022 డిసెంబ‌ర్‌లో అమెరికా వెళ్లారు. అక్క‌డ టెన్నెసీ రాష్ట్రంలోని ఒక యూనివ‌ర్శిటీలో ఎంఎస్ చ‌దువుతోంది. శుక్ర‌వారం రాత్రి ఆమె త‌న స్నేహితుల‌తో క‌లిసి కారులో వెళ్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. రాక్‌వుడ్ ఎవెన్యూ స‌మీపంలో వారు ప్ర‌యాణిస్తున్న కారును వేగంగా వ‌చ్చిన‌ ట్ర‌క్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్ర‌యాణిస్తున్న వారికి తీవ్రగాయాలు అయ్యారు.

నాగ‌శ్రీ వంద‌న ప‌రిమ‌ళతో పాటు స్నేహితుల‌కు కూడా తీవ్ర గాయాలు అయ్యారు. వీరిని వెంట‌నే స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. నాగ‌శ్రీ వంద‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో నాగ‌శ్రీ వంద‌న స్నేహితులు నికిత్‌, ప‌వ‌న్ తీవ్రంగా గాయ‌ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నికిత్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉండ‌గా, ప‌వ‌న్ ప‌రిస్థితి మాత్రం విష‌మంగా ఉంద‌ని తెలిసింది. కుమార్తె మృతి చెందిన‌ట్లు నాగ శ్రీ వంద‌న త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ వ‌చ్చింది.

దీంతో అల్లారిముద్దుగు పెంచి పెద్ద చేసిన కుమార్తె మృతితో ఆ కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది. త‌ల్లిదండ్రులు రోదిస్తున్నారు. కుటుంబ స‌భ్య‌లులు, బంధువులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. నాగ శ్రీ వంద‌న మృతితో స్వ‌స్థ‌లం తెనాలిలోని వారి నివాసం ప్రాంతంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. నాగ శ్రీ వంద‌న మృతి దేహాన్ని స్వ‌స్థ‌లానికి వీలైనంత త్వ‌ర‌గా పంపించేందుకు తానా స‌భ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అమెరికాలో ప్ర‌కాశం జిల్లా సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ మృతి:

అమెరికాలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన‌ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ మృతి చెందారు. ముండ్ల‌మూరుకు చెందిన దొద్దాల కోటేశ్వ‌ర‌రావు, కోటేశ్వ‌ర‌మ్మ‌ల‌కు కుమారుడు బుచ్చిబాబు (40), ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు దొద్దాల బుచ్చిబాబు ఎనిమిదేళ్ల‌గా హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. కంపెనీ ఆదేశాల ప్ర‌కారం ఏడాద‌న్న‌ర క్రిత‌మే భార్య కిర‌ణ్మ‌యితో క‌లిసి కాలిఫోర్నియాకు వెళ్లి అక్క‌డే నివాసం ఉంటుంది. అక్క‌డే ఉద్యోగం చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా స‌ముద్ర స్నానానికి వెళ్లారు. అక్క‌డ ఈత కొడుతుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు స‌ముద్రంలో కొట్టుకుపోయి ఊపిరాడ‌క మృతి చెందాడు.

మరోవైపు లండ‌న్‌లో ప్ర‌కాశం జిల్లా యువ‌కుడు మృతి చెందాడు. నాలుగు రోజులు క్రితం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న మృత్యువాత ప‌డ్డారు. ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తి మండ‌లం బూద‌వాడ‌కు చెందిన పంగ‌లూరి చిరంజీవి ఎంఎస్ చేసేందుకు లండ‌న్ వెళ్లాడు. 

ఎంఎస్ పూర్తి చేసిన త‌రువాత అక్క‌డే ఉద్యోగం చేస్తున్నారు. మంగ‌ళ‌వారం న‌లుగురు స్నేహితుల‌తో క‌లిసి చిరంజీవి కారులో వెళ్తుతుండ‌గా లీసెస్ట‌ర్ స‌మీపంలో వాహ‌నం అదుపు త‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెట్టుకు బ‌లంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన చిరంజీవి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. న‌లుగురు స్నేహితులు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner