Eluru Crime : ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు..! కక్ష గట్టి తండ్రిని హ‌త్య చేసిన నిందితుడు-harassment of the girl in the name of love the accused killed the girl father in eluru district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Eluru Crime : ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు..! కక్ష గట్టి తండ్రిని హ‌త్య చేసిన నిందితుడు

Eluru Crime : ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు..! కక్ష గట్టి తండ్రిని హ‌త్య చేసిన నిందితుడు

HT Telugu Desk HT Telugu
Dec 15, 2024 10:22 AM IST

ప్రేమ పేరుతో బాలికను వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు తండ్రి నిరాకరించటంతో.. కక్షపెంచుకున్నాడు. సమయం కోసం వేచి చూసిన నిందితుడు… బాలిక తండ్రిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా కేంద్రంలో వెలగు చూసింది.

బాలిక‌పై ప్రేమ పేరుతో వేధింపులు -బాలిక తండ్రి హత్య
బాలిక‌పై ప్రేమ పేరుతో వేధింపులు -బాలిక తండ్రి హత్య

ఏలూరులో దారుణ‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బాలిక‌పై ప్రేమ పేరుతో ఓ యువ‌కుడు వేధించాడు. బాలికను పెళ్లి చేసుకుంటాన‌ని అడిగాడు. అందుకు బాలిక తండ్రి నిరాక‌రించాడు. దీంతో ఆయ‌న‌పై క‌క్ష పెట్టుకుని ప‌థ‌కం ప్రకారం బాలిక‌ తండ్రిని హ‌త్య చేశాడు. అనంత‌రం అక్క‌డి నుండి పరార‌య్యాడు.

ఈ ఘ‌ట‌న ఏలూరు జిల్లా కేంద్రంలోని రామ‌కృష్ణాపురం రైల్వే ఫ్లై ఓవ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద శ‌నివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం… ఏలూరు న‌గ‌రంలోని రామ‌కృష్ణాపురం రైల్వే ఫ్లై ఓవ‌ర్ బ్రిడ్జి 39వ పిల్ల‌ర్ ప్రాంతంలో వెంక‌ట‌క‌న‌క‌రాజు, నాగ‌మ‌ణి దంప‌తులు నివాసం ఉండేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. క‌న‌క‌రాజు ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగ‌మ‌ణి ఎనిమిదేళ్ల క్రిత‌మే అనారోగ్యంతో మృతి చెందింది. వీరి పెద్ద కుమార్తె (12)ను ఏలూరు రూర‌ల్ వెంక‌టాపురం ప్రాంతానికి చెందిన నాని అనే యువ‌కుడు ప్రేమ‌పేరుతో వేధిస్తున్నాడు.

ఆ బాలిక‌తో పెళ్లి చేయ‌మ‌ని క‌న‌క‌రాజును సైతం వేధిస్తూ ఉండేవాడు. అందుకు క‌న‌క‌రాజు అంగీక‌రించ‌లేదు. ఈ నేప‌థ్యంలో క‌న‌క‌రాజు, నానికి ప‌లుమార్లు గొడ‌వ కూడా జ‌రిగింది. భార్య మృతి చెంద‌డంతో ముగ్గురు కుమార్తెల‌ను తీసుకుని క‌న‌క‌రాజు ఉంగుటూరు మండ‌లం నారాయ‌ణ‌పురం గ్రామంలో ఉంటున్నాడు. తాపీ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. నారాయ‌ణ‌పురం నుంచి క‌న‌క‌రాజు శుక్ర‌వారం రామ‌కృష్ణాపురం ప్రాంతానికి వ‌చ్చాడు. గ‌తంలో తాను నివాసం ఉంటున్న పిల్ల‌ర్ నెంబ‌ర్ 29 వ‌ద్ద‌కు వ‌చ్చి ప‌క్క‌నే నివాసం ఉంటున్న నాగిరెడ్డి గంగ‌లక్ష్మిని ప‌ల‌క‌రించాడు. ఈ రోజుకు ఇక్కడే ఉంటాన‌ని చెప్పాడు. శుక్ర‌వారం రాత్రి క‌న‌కరాజు అక్క‌డే ప‌డుకున్నాడు.

క‌న‌క‌రాజు ఏలూరు వ‌చ్చిన విష‌యం తెలుసుకున్న నాని… అక్క‌డ‌కు వ‌చ్చాడు. కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయ‌మ‌ని క‌న‌క‌రాజును నాని అడిగాడు. అందుకు క‌న‌క‌రాజు నిరాక‌రించాడు. దీంతో మ‌ళ్లీ వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో శ‌నివారం తెల్ల‌వారుజామున‌ క‌న‌క‌రాజుపై నాని త‌న‌తో తెచ్చుకున్న ప‌దునైన చాకుతో దాడి చేశాడు. గొంతుపై ప‌లుమార్లు పొడవ‌డంతో క‌న‌క‌రాజుకు తీవ్ర‌గాయాలు అయ్యాయి. దీంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. దీంతో నానికి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని ఏలూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఏలూరు త్రీటౌన్ సీఐ ఎస్. కోటేశ్వ‌ర‌రావు మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశామ‌ని, అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు సీఐ కోటేశ్వ‌ర‌రావు తెలిపారు. తండ్రి హ‌త్యకు గురికావ‌డంతో ఈ ముగ్గురు కుమార్తెల రోదిస్తున్నారు. ఏలూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి చేరుకున్న ముగ్గురు చిన్నారులు రోద‌న‌లతో స్థానికుల మ‌న‌సు క‌ల‌చివేసింది. పోస్టుమార్టం అనంత‌రం మృత‌దేహాన్నికుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. తండ్రి మ‌ర‌ణంతో ఆ చిన్నారుల‌ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. దిక్కుతోచ‌ని వారయ్యారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం