AP TG Weather News : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన..!-heavy rains are likely in andhrapradesh with impact of low pressure latest weather updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Weather News : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన..!

AP TG Weather News : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన..!

AP Telangana Weather Updates : నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. మరోవైపు తెలంగాణలో కూడా డిసెంబర్ 17వ తేదీ నుంచి వానలు పడనున్నాయి.

ఏపీకి భారీ వర్ష సూచన

ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో రెండు రోజుల్లో బలపడుతుందని పేర్కొంది. ఆ తర్వాత పశ్చిమ - వాయువ్య దిశగా తమిళనాడు తీరంవైపు కదిలే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.

ఈ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావం ఏపీపై ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అల్పపీడనం ప్రభావంతో రేపు ప్రకాశం,నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మంగళవారం కోస్తా,రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

భారీ వర్ష సూచన నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి‌‌‌‌. వాగులు వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

తెలంగాణలోనూ వర్షాలు...!

తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పొడి వాతవరణం ఉంటుందని… ఆ తర్వాత తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.

డిసెంబర్ 17వ తేదీ నుంచి తెలంగాణలో తేలికపాటి వానలు పడనున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడకక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.