AP Weather Alert : బలపడుతున్న అల్పపీడనం- కోస్తా, రాయలసీమలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు
AP Weather Alert : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మీద అల్పపీడన ప్రాంతం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్రానికి 5.8 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ, వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి, ఆ తర్వాత డిసెంబర్ 11వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతం వద్ద శ్రీలంక- తమిళనాడు తీరాలకు చేరుతుందని అధికారులు తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రకటించింది.
డిసెంబర్ 10న వాతావరణం
అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణలో చలి తీవ్రత
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉపరితల గాలులు దక్షిణ, నైరుతి దిశలో గంటకు 4-8 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సంబంధిత కథనం