Kolkata rape case : కోల్​కతా వైద్యురాలి కేసులో ఆర్​జీ కర్​ మాజీ ప్రిన్సిపాల్​కి బెయిల్​- భగ్గుమన్న నిరసనలు..-kolkata rape case protest erupts in city after ex rg kar principal sandip ghosh gets bail ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kolkata Rape Case : కోల్​కతా వైద్యురాలి కేసులో ఆర్​జీ కర్​ మాజీ ప్రిన్సిపాల్​కి బెయిల్​- భగ్గుమన్న నిరసనలు..

Kolkata rape case : కోల్​కతా వైద్యురాలి కేసులో ఆర్​జీ కర్​ మాజీ ప్రిన్సిపాల్​కి బెయిల్​- భగ్గుమన్న నిరసనలు..

Sharath Chitturi HT Telugu
Dec 15, 2024 05:55 AM IST

Kolkata rape case news : కోల్​కతా వైద్యురాలి హత్య కేసులో సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అరెస్ట్​ అయిన సందీప్​ ఘోష్​కి బెయిల్​ మంజురైంది. దీనికి వ్యతిరేకంగా కోల్​కతా వ్యాప్తంగా నిరసనలు మళ్లీ భగ్గుమన్నాయి.

కోల్​కతా నిరసనల్లో జూనియర్​ డాక్టర్లు..
కోల్​కతా నిరసనల్లో జూనియర్​ డాక్టర్లు..

కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్​ సహా యావత్​ దేశాన్ని కుదిపేసిన కోల్​కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆర్​జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ అధికారి అభిజిత్ మొండల్​కి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కోల్​కతాలో నిరసనలు వెల్లువెత్తాయి.

yearly horoscope entry point

అటు బెయిల్​- ఇటు నిరసనలు..

ఈ ఏడాది ఆగస్టు 9న ఆర్​జీ కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్​పై అత్యాచారం, హత్య కేసులో ఘోష్, మొండల్​ని పోలీసులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాక్ష్యాలను తారుమారు చేశారని, రెండోసారి శవపరీక్ష నిర్వహించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినా.. మహిళా వైద్యురాలి మృతదేహానికి హడావుడిగా దహన సంస్కారాలకు ప్రయత్నించారని వారిపై ఆరోపణలు ఉన్నాయి.

అయితే, కోల్​కతా వైద్యురాలి హత్య కేసులో 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ విఫలం కావడంతో సందీప్ ఘోష్, అభిజిత్ మొండల్​లకు కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.

అత్యాచారం అనంతరం హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు.. వివిధ వైద్యుల సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి బాధితురాలికి న్యాయం చేయాలంటూ వీధుల్లోకి వచ్చారు.

సీబీఐ ఏం ప్లాన్ చేస్తుందో తెలియడం లేదు. అయినా మేం ఆశలు వదులుకోవడం లేదు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతాము. న్యాయపోరాటం, వీధుల్లో పోరాటం సమాంతరంగా కొనసాగుతాయి,” అని శనివారం సాల్ట్ లేక్​లో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న బాధితురాలి తండ్రి మీడియా ప్రతినిధులతో అన్నారు.

పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ (డబ్ల్యుబీజేడీఎఫ్) కరుణమోయి అనే ప్రాంతం నుంచి సాల్ట్ లేక్​లోని సీజీఓ కాంప్లెక్స్ వద్ద సీబీఐ కార్యాలయం వరకు మధ్యాహ్నం నిరసన ర్యాలీ నిర్వహించింది.

"నేడు ఘోష్ లాంటి వారికి బెయిల్ మంజూరైంది. రేపు ఆయన్ను పేరున్న మెడికల్ కాలేజీలో చేర్పించే అవకాశం ఉంది. మాకు న్యాయం జరిగే వరకు రోడ్లపైనే ఉంటాం. సీబీఐపై మాకు నమ్మకం ఉంది. కానీ ఏజెన్సీ ఏమి చేస్తోంది?" అని డబ్ల్యుబీజేడీఎఫ్ సభ్యుడు దేబాశిష్ హల్దర్ అన్నారు.

అంతకుముందు సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎస్ యూసీఐ(సీ)) కూడా ఇదే మార్గంలో నిరసన ప్రదర్శన నిర్వహించింది.

“సీబీఐకి డిప్యుటేషన్ సమర్పిస్తాము. అయితే అది కేవలం ఖాళీ కాగితమే. మేమంతా షాక్​కు గురయ్యాము. మేం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కానీ సీబీఐ ఏమీ చేయలేదు,” అని ఎస్ యూసీఐ(సీ) నేత చండీదాస్ భట్టాచార్య మీడియాకు తెలిపారు.

శనివారం మధ్యాహ్నం ఎస్​ప్లానేడ్​లో ర్యాలీ నిర్వహించిన వివిధ సంస్థలు.. డాక్టర్స్, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, అన్ని వర్గాల పౌరులు త్వరలో వీధుల్లోకి వస్తారని ప్రకటించారు.

“మాకు నిరాశ, కోపం ఉన్నాయి. త్వరలోనే వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతాం. బాధితురాలి కుటుంబాని న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలనే సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ఫెడరల్ ఏజెన్సీకి పంపాలనుకుంటున్నాం,” అని డాక్టర్ల జాయింట్ ప్లాట్ ఫామ్ సభ్యుడు డాక్టర్ ఉత్పల్ బెనర్జీ అన్నారు.

ఘోష్, మోండల్​లపై ప్రాసిక్యూషన్ చర్యల కోసం ఫెడరల్ ఏజెన్సీ అభ్యర్థనకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీబీఐ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి తెలియజేయడంతో సర్వీస్ డాక్టర్స్ ఫోరం (ఎస్​డీఎఫ్) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒక లేఖను పంపింది.

ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనతో సంబంధం ఉన్న వారందరినీ, సాక్ష్యాలను అణచివేసేందుకు ప్రయత్నించిన వారందరినీ సత్వరమే శిక్షించాలని కోరుతున్నాం,” అని లేఖలో పేర్కొన్నారు.

ఘోష్, మొండల్​లపై చర్యలు తీసుకునేందుకు సీబీఐకి అనుమతి నిరాకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్​డీఎఫ్ లేఖలో కోరింది.

బాధితురాలి కుటుంబం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది బృందా గ్రోవర్ కూడా హైప్రొఫైల్ కేసు నుంచి తప్పుకున్నారు. “ఇప్పటికే మరో న్యాయవాదితో చర్చలు జరిపాం. పోరాటం కొనసాగిస్తాం,” అని బాధితురాలి తండ్రి తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.