Constable suicide: భార్య చిత్రహింసలు భరించలేక కానిస్టేబుల్ ఆత్మహత్య; రైల్వే ట్రాక్ పై యూనిఫామ్ తో మృతదేహం-bengaluru shocker cop kills self in uniform amid row over techies suicide ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Constable Suicide: భార్య చిత్రహింసలు భరించలేక కానిస్టేబుల్ ఆత్మహత్య; రైల్వే ట్రాక్ పై యూనిఫామ్ తో మృతదేహం

Constable suicide: భార్య చిత్రహింసలు భరించలేక కానిస్టేబుల్ ఆత్మహత్య; రైల్వే ట్రాక్ పై యూనిఫామ్ తో మృతదేహం

Sudarshan V HT Telugu
Dec 14, 2024 05:29 PM IST

Constable suicide: తన భార్య, తన మామ పెడుతున్న చిత్రహింసలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని సూసైడ్ నోట్ రాసి బెంగళూరులో హెడ్ కానిస్టేబుల్ తిప్పన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఒక టెక్కీ ఇవే కారణాలతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

భార్య చిత్రహింసల భరించలేక కానిస్టేబుల్ ఆత్మహత్య
భార్య చిత్రహింసల భరించలేక కానిస్టేబుల్ ఆత్మహత్య (HT)

Constable suicide: బెంగళూరులో పనిచేస్తున్న బీహార్ కు చెందిన ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే, దాదాపు అవే కారణాలతో బెంగళూరు పోలీస్ కానిస్టేబుల్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరు (bengaluru news) లోని హులిమావు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న హెచ్ సీ తిప్పన్న (34) భార్య, అత్తమామల చిత్రహింసల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతడు యూనిఫామ్ లోనే ఉన్నాడు.

yearly horoscope entry point

భార్య వేధింపులతో..

హెడ్ కానిస్టేబుల్ తిప్పన్న కర్నాటక (karnataka news) లోని విజయపుర జిల్లా సింధగి పట్టణానికి సమీపంలోని హండిగనూరు గ్రామానికి చెందినవాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి హీలలిగె రైల్వేస్టేషన్ నుంచి కార్మేలారం హుసగూరు రైల్వే గేటు మధ్య రైల్వే ట్రాక్ పై జరిగింది. తిప్పన్న మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రస్తుతం బయప్పనహళ్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సూసైడ్ నోట్..

తన భార్య, మామ యమునప్ప చిత్రహింసలు పెడుతున్నారని, మానసికంగా వేధిస్తున్నారని, వారి వేధింపులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని సూసైడ్ నోట్ లో హెడ్ కానిస్టేబుల్ తిప్పన్న రాశాడు. తన భార్య, మామ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు ఆరోపించాడు. డిసెంబర్ 12న రాత్రి 7.26 గంటలకు తన మామ యమునప్ప తనకు ఫోన్ చేసి 14 నిమిషాలు మాట్లాడి బెదిరించాడని తెలిపాడు.

చచ్చిపో అని బెదిరించారు..

డిసెంబర్ 13 ఉదయం కూడా తన మామ నుంచి ఫోన్ వచ్చిందని, తనను చచ్చిపోవాలని బెదిరించారని తిప్పన్న ఆ సూసైడ్ నోట్ లో వివరించాడు. ‘‘నువ్వు చచ్చిపోతేనే నా కూతురు బాగుపడుతుంది’’ అని తన మామ చెప్పాడని వివరించాడు. తనను బూతులు తిట్టాడని ఆ నోట్ లో పేర్కొన్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 108, 351(3), 352 కింద కేసు నమోదు చేశారు.

అతుల్ సుభాష్ కేసు

అత్తింటి వారు మానసికంగా హింసించారని ఆరోపిస్తూ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వారం రోజుల్లో ఇది రెండోసారి. ఓ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్న బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగా సోమవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యపై పలు ఆరోపణలు చేస్తూ గంటకుపైగా నిడివి ఉన్న వీడియోను చిత్రీకరించి 24 పేజీల సూసైడ్ నోట్ ను వదిలిపెట్టాడు. విడాకుల సెటిల్మెంట్ కోసం తన భార్య నికితా సింఘానియా తనను రూ.3 కోట్లు డిమాండ్ చేసిందని సుభాష్ ఆరోపించారు. సుభాష్ ఆత్మహత్య సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.