Bougainvillea Review: సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లతో సాగే పుష్ప 2 విలన్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Bougainvillea Review: మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బోగన్ విల్లా సోనీ లివ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, కుంచాకో బోబన్ హీరోలుగా నటించారు.
Bougainvillea Review: ఫహాద్ ఫాజిల్, కుంచాకో బోబన్, జ్యోతిర్మయి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం మూవీ బోగన్ విల్లా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అమల్ నీరద్ దర్శకత్వం వహించాడు. థియేటర్లలో కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఎలా ఉందంటే?
బోగన్ విల్లా కథ...
రాయిస్ (కుంచాకో బోబన్) ఓ డాక్టర్. యాక్సిడెంట్‌లో అతడి భార్య రీతూ (జ్యోతిర్మయి) అమ్నేసియా బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. రీతూ జీవితంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. తన ఇద్దరు పిల్లల సంరక్షణను చూస్తూ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటుంది రీతూ. ఓ హిల్ స్టేషన్‌లోని హాస్పిటల్‌లో పనిచేస్తూ భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటుంటాడు రాయిస్.
ఆ హిల్ స్టేషన్‌లోని ఓ కాలేజీలో చదువుతున్న మినిస్టర్ కూతురు కనిపించకుండాపోతుంది. మినిస్టర్ కూతురు మిస్సింగ్‌కు రీతూకు సంబంధం ఉందని ఏసీపీ డేవిడ్ కోషి (ఫహాద్ ఫాజిల్) అనుమానిస్తాడు. అతడి ఇన్వేస్టిగేషన్‌లో రీతూకు పిల్లలు లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకుంటుందనే నిజం బయటపడుతుంది. క్రిమినాలజిస్ట్ మీరాతో కలిసి డేవిడ్ కోషి సాగించిన అన్వేషణలో రీతూ గురించి షాకింగ్ విషయాలు బయటపడతాయి.
మినిస్టర్ కూతురితో పాటు అదే ఏరియాలో మరో ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్‌కు రీతూకు సంబంధం ఉందని తెలుస్తుంది. రీతూను కలిసిన మీరా కూడా కనిపించకుండాపోతుంది. వీరిందరిని కిడ్నాప్ చేసింది ఎవరు? రీతూకు ఈ మిస్సింగ్‌లకు ఎలాంటి సంబంధం ఉంది? రాయిస్ గురించి రీతూకు ఎలాంటి నిజాలు తెలిశాయి? రీతూకు ఉన్న సమస్యను అడ్డం పెట్టుకొని రాయిస్ ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు? మీరాను రీతూ ఎలా కాపాడింది అన్నదే బోగన్ విల్లా ఈ మూవీ కథ.
క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్...
టైటిల్, అందులో నటించిన ఆర్టిస్టులతోనే కొన్ని సినిమాలను వెంటనే చూసేయాలనేంతగా ఆసక్తిని కలిగిస్తాయి. బోగన్‌విల్లా అలాంటి మూవీనే. మలయాళం అగ్ర హీరోలు ఫహాద్ ఫాజిల్, కుంచాకో బోబన్ కాంబినేషన్‌లో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా దర్శకుడు అమల్ నీరద్ ఈ మూవీని తెరకెక్కించాడు.
అమ్మాయిల మిస్సింగ్ కేసులో జ్ఞాపకశక్తి కోల్పోయిన మహిళ ఎలా అనుమానితురాలిగా మారిందనే పాయింట్‌తో దర్శకుడు బోగన్ విల్లా కథను రాసుకున్నాడు. ఓ వైపు క్రైమ్ ఇన్వేస్టిగేషన్....మరోవైపు తన జీవితంలోని మిస్టరీని సాల్వ్ చేసే క్రమంలో ఓ మహిళ ఎదుర్కొనే సంఘర్షణ చుట్టూ ఈ కథను నడిపించాడు.
కమల్ హాసన్ ఎర్రగులాబీలు...
బోగన్ విల్లా సినిమా చూస్తుంటే 1978లోనే కమల్‌హాసన్ హీరోగా నటించిన ఎర్ర గులాబీలు మూవీ గుర్తొస్తుంది. కమల్‌హాసన్ మూవీనే నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా అటూ ఇటూగా మార్చి బోగన్ విల్లాను తెరకెక్కించిన ఫీలింగ్ కలుగుతుంది. బోగన్‌విల్లా ఆరంభం బాగుంది. యాక్సిడెంట్ సీన్‌తోనే సినిమాను మొదలుపెట్టాడు దర్శకుడు.
రీతూ అమ్నేషియా బారిన పడటం, ఆమె యోగక్షేమాలను చూసుకునే భర్తగా కుంచాకోబోబన్ పాత్రను పరిచయం చేశారు. మినిస్టర్ కూతురు మిస్సింగ్ కేసులో రీతూను డేవిడ్ కోషి ఇన్వేస్టిగేషన్ చేయాలని వచ్చినప్పటి నుంచే సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారిన ఫీలింగ్ కలుగుతుంది.
అక్కడి నుంచే రీతూ లైఫ్ గురించి ఒక్కో ట్విస్ట్‌ను రివీల్ చేస్తూ వెళ్లాడు దర్శకుడు. అసలైన క్రిమినల్‌ను ఎలా రివీల్ చేయాలనే సీన్ నుంచి పట్టువదిలేశాడు.
రొటీన్ ఫ్లాష్‌బ్యాక్…
ఫహాద్ ఫాజిల్‌తో పాటు రీతూ ఇన్వేస్టిగేషన్‌లో కిల్లర్ బయటపడినట్లుగా కాకుండా నేరుగా విలన్‌ను పరిచయం చేయడం ఆకట్టుకోదు. సీరియల్ కిల్లర్ సినిమాల్లో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉండటం కామన్. ఈ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ను ఎంత బలంగా రాసుకుంటే విలన్ పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది.
బోగన్ విల్లాలో విలన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను డైరెక్టర్ పరమ రొటీన్‌గా రాసుకున్నాడు. ఈ సీన్స్ ఏ మాత్రం ఆకట్టుకోవు. ఫహాద్ ఫాజిల్ ఇన్వేస్టిగేషన్ సీన్స్ ఓపికకు పరీక్ష పెడతాయి. ఎండింగ్ మామూలుగా ఉంది.
హీరోగా కనిపించే విలన్…
ఈ సినిమా మొత్తం జ్యోతిర్మయి క్యారెక్టర్ ప్రధానంగానే సాగుతుంది. రీతూ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. తన లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలియక అనుక్షణం సంఘర్షణకు లోనయ్యే మహిళ పాత్రకు న్యాయం చేసింది. హీరోగా కనిపించే విలన్ పాత్రలో కుంచాకోబోబన్ అదరగొట్టాడు. అతడి క్యారెక్టర్‌లోని వేరియేషన్స్‌ను దర్శకుడు స్క్రీన్‌పై ప్రజెంట్ చేసిన తీరు బాగుంది.
ఫహాద్ ఫాజిల్ హీరోకు ఎక్కువ...గెస్ట్ రోల్‌కు తక్కువ అన్నట్లుగా ఫహాద్ పాజిల్ క్యారెక్టర్ సాగుతుంది. ఇన్వేస్టిగేషన్ సీన్స్‌లోనే అతడు కనిపిస్తాడు. కేవలం క్రేజ్ కోసమే ఫహాద్ ఫాజిల్ ఈ క్యారెక్టర్ కోసం తీసుకున్నట్లుగా అనిపిస్తుంది.
క్రైమ్ థ్రిల్లర్ లవర్స్
బోగన్ విల్లా టైటిల్‌లో ఉన్న క్రియేటివిటీ, కొత్తదనం సినిమాలో లేదు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారిని ఈ మూవీ మెప్పిస్తుంది. కాస్త ఓపికగా చూడాల్సిందే.