YS Jagan Assets Case : జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం - సుప్రీంకోర్టుకు సీబీఐ, ఈడీ నివేదిక
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో వివరాలతో కూడిన నివేదికను సీబీఐ, ఈడీ… సుప్రీంకోర్టుకు అందజేశాయి. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత.. తీర్పు ఇవ్వనుంది. అక్రమాస్తుల కేసు బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన కేసులకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను సుప్రీం కోర్టుకు సీబీఐ, ఈడీ అందజేశాయి. ఆ నివేదికను పరిశీలించిన తరువాతే తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జనవరి 10 వాయిదా పడింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణలో జాప్యంపై అఫిడవిట్ రూపంలో నివేదికను సీబీఐ, ఈడీ దాఖలు చేశాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్‌లో దర్యాప్తు సంస్థలు వివరించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతోందని… వేగవంతంగా ట్రయల్ పూర్తి చేసేందుకు తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని.. లేకపోతే కేసుల విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లను శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ కూడిన ధర్మాసనం విచారించింది. సీబీఐ, ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జీ) రాజ్‌కుమార్ భాస్కర్ ఠాక్రే వాదనలు వినిపిస్తూ సీబీఐ, ఈడీ కేసుల స్టేటస్ వివరాలు గురువారం సాయంత్రం ఫైల్ చేసినట్లు ధర్మాసనానికి తెలిపారు. దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్ కాపీ తాము పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. తాము కూడా పరిశీలించడానికి కొంత సమయం కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరారు.
వైఎస్ జగన్ కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని గతంలో దర్యాప్తు సంస్థలను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కేసుల స్టేటస్‌ను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఈనెల 2 (సోమవారం)న విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థలను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసుల పురోగతిని, ప్రస్తుత పరిస్థితి, గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ఆ తరువాత పరిణామాలతో అఫిడవిట్ రూపంలో స్టేటస్ రిపోర్టును దర్యాప్తు సంస్థలు దాఖలు చేశాయి. సిబిఐ, ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తీర్పు ఇస్తామని తరువాత జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది.
జగన్ అక్రమాస్తులు వ్యవహారంలో మొత్తం 125 పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉన్నాయి. ట్రైల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దాఖలైన పిటిషన్లలో దాదాపు 80 శాతం పిటిషన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ విషయం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ముందు దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడి అయ్యాయి. శుక్రవారం జరిగిన విచారణలో రఘురామ కృష్ణరాజు తరపున న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ హాజరయ్యారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం