Tirumala : జనవరి 10 నుంచి 19 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు, ఆ 10 రోజులు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు-tirumala srivari vaikunta ekadasi darshan ttd key decisions ten day vip special darshan cancelled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : జనవరి 10 నుంచి 19 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు, ఆ 10 రోజులు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు

Tirumala : జనవరి 10 నుంచి 19 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు, ఆ 10 రోజులు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు

Bandaru Satyaprasad HT Telugu
Dec 14, 2024 08:30 PM IST

Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పది రోజులు విశేష దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

జనవరి 10 నుంచి 19 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు, ఆ 10 రోజుల ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు
జనవరి 10 నుంచి 19 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు, ఆ 10 రోజుల ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు

Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పురష్కరించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

yearly horoscope entry point

వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు

  • దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.
  • చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.
  • ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు.
  • భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు.
  • గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.
  • భక్తులకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.
  • మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ ఛైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించరు. జనవరి 11 నుంచి 19వ తేదీ వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు.
  • 3 వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్, గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకుంటారు.

డిసెంబరు 28న ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో’

టీటీడీ ‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో’ కార్యక్రమం డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్నమ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్

టీటీడీ ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్‌ బ్యాడ్జ్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యలకు వెనుకాడబోమన్నారు. ఈ నేమ్‌ బ్యాడ్జ్‌ ద్వారా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. శ్రీనివాసుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా, అంకితభావంతో టీటీడీ ఉద్యోగులు ప్రవర్తించేందుకు ఈ బ్యాడ్జ్‌ విధానం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. టీటీడీ అన్ని విభాగాల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగికి ఈ నేమ్‌ బ్యాడ్జ్‌ త్వరలోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం