AP Crop Insurance : రైతుల‌కు అలర్ట్‌, పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపున‌కు రేపే ఆఖ‌రు తేదీ-ap crop insurance premium payment process end process premium amount ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Crop Insurance : రైతుల‌కు అలర్ట్‌, పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపున‌కు రేపే ఆఖ‌రు తేదీ

AP Crop Insurance : రైతుల‌కు అలర్ట్‌, పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపున‌కు రేపే ఆఖ‌రు తేదీ

HT Telugu Desk HT Telugu
Dec 14, 2024 09:13 PM IST

AP Crop Insurance : ఏపీలో పంట బీమా ప్రీమియం చెల్లింపు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులు నేరుగా బ్యాంకుల ద్వారా, రుణాలు తీసుకోని రైతులు సీఎస్సీ ద్వారా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

రైతుల‌కు అలర్ట్‌, పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపున‌కు రేపే ఆఖ‌రు తేదీ
రైతుల‌కు అలర్ట్‌, పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపున‌కు రేపే ఆఖ‌రు తేదీ

AP Crop Insurance : రాష్ట్రంలో రైతుల‌కు అల‌ర్ట్. పంటల‌ బీమా ప్రీమియం చెల్లింపున‌కు రేపే ఆఖరు తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులు బ్యాంకుల ద్వారా బీమా ప్రీమియం చెల్లించాలి. రుణం తీసుకోని రైతులు కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ద్వారా నేరుగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ రైతులు బీమా ప్రీమియం చెల్లించ‌క‌పోతే, వారికి ప్రభుత్వ బీమా ప‌థ‌కం వ‌ర్తించ‌దు. క‌నుక రైతులంతా బీమా ప్రీమియం చెల్లించి, త‌మ పంట‌ల‌కు బీమా చేసుకోవాల‌ని ప్రభుత్వం కోరుతోంది.

రాష్ట్రంలోని 2024-25 సంవ‌త్సరానికి ర‌బీ సీజ‌న్‌కు పంట‌ల బీమా ప‌థ‌కాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ‌లు చేస్తోంది. వ్యవ‌సాయ శాఖ కార్యద‌ర్శి ఆదేశాల మేర‌కు అన్ని జిల్లాల క‌లెక్టర్లు వ్యవ‌సాయ అధికారుల‌తో స‌మావేశాలు, వీడియో కాన్ఫెరెన్స్‌లు నిర్వహించారు. పంట‌ల బీమా ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు రైతులు ప్రీమియం చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. దీంతో అన్ని జిల్లా నుంచి మండ‌లం వ‌ర‌కు వ్యవ‌సాయ అధికారులు రైతులు బీమా చెల్లింపున‌కు చ‌ర్యలు చేప‌ట్టారు. డిసెంబ‌ర్ 15న ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. రేప‌టితో గ‌డువు ముగియ‌నుండ‌డంతో అన్ని జిల్లాల్లో ఏవోలు, రైతు సేవా కేంద్రాల ఇన్‌చార్జ్‌లు రంగంలో దిగి రైతుల చేత బీమా ప్రీమియం క‌ట్టించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అయితే వ‌రికి మాత్రం ఈ నెల 31 వ‌ర‌కు ప్రీమియం చెల్లింపులు చేసేందుకు గ‌డువు పెంచారు.

ఏ పంట‌కు..ఎంత ప్రీమియం?

బీమా ప్రీమియం పంట పంట‌కు వేర్వేరుగా ఉంటుంది. రైతుల వాటా కింద వ‌రికి ఎక‌రాకు రూ. 638, శ‌న‌గ‌కు ఎక‌రాకు రూ.486, వేరుశ‌న‌గకు ఎక‌రాకు రూ.486, జొన్నకు ఎక‌రాకు రూ.319, పెస‌ల‌కు ఎక‌రాకు రూ.273, మినుములకు ఎక‌రాకు రూ.288, నువ్వుల‌కు ఎక‌రాకు రూ.182, స‌న్‌ప్లవ‌ర్‌కు ఎక‌రాకు రూ.304 రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఉల్లి, ట‌మాటతో పాటు ఇత‌ర పంట‌ల‌కు కూడా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

బీమా ప్రీమియం ఎలా చెల్లించాలి?

ప్రీమియం చెల్లింపున‌కు పంట రుణ తీసుకున్న రైతులు నేరుగా బ్యాంకు ద్వారా మాత్రమే చెల్లింపులు జ‌ర‌పాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులతో బీమా ప్రీమియం క‌ట్టించేలా బ్యాంకు సిబ్బంది చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారులు సూచించారు. ర‌బీలో బ్యాంకు ద్వారా పంట రుణాలు పొంద‌ని రైతులు కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ద్వారా నేరుగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే రైతులే స్వయంగా ఎన్‌సీఐపీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా న‌మోదు చేసుకోవ‌చ్చు.

ఏఏ ప‌త్రాలు ఉండాలి?

కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ద్వారా నేరుగా ప్రీమియం చెల్లించే రైతుల‌కు కొన్ని ప‌త్రాలు అవ‌స‌రం అవుతాయి. నేరుగా ప్రీమియం చెల్లించే రైతులు ఆధార్ కార్డు జిరాక్స్‌, బ్యాంక్ పాస్‌బుక్‌, ప‌ట్టాదారు పాస్ పుస్తకం, పంట ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నెంబ‌ర్ వివ‌రాలు జ‌త చేయాల్సి ఉంటుంది. వాటిని కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌లో న‌మోదు చేసుకోవాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం