OTT: ఓటీటీలో విజయ్ సేతుపతి, వెట్రిమారన్ సూపర్ హిట్ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ - తెలుగులోనూ చూడొచ్చు
OTT: విజయ్ సేతుపతి హీరోగా నటించిన విడుదల 2 మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సీక్వెల్‌కు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. సీక్వెల్ రిలీజ్‌కు ముందు విడుదల మూవీ జీ5 ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్ అవుతోంది.
OTT: విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన విడుదల 2 మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో సూరి ప్రధాన పాత్రలో నటిస్తోన్నాడు. గత ఏడాది రిలీజై కమర్షియల్ హిట్‌గా నిలిచిన విడుదల మూవీకి సీక్వెల్‌గా విడుదల 2 మూవీ తెరకెక్కుతోంది.
ఓటీటీలో వంద మిలియన్ల వ్యూస్...
విడుదల మూవీ థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించింది. జీ5 ఓటీటీలో రిలీజైన ఈ యాక్షన్ డ్రామా మూవీ వంద మిలియన్లకుపైగా వ్యూస్‌ను దక్కించుకున్నది. విడుదల 2 రిలీజ్ నేపథ్యంలో జీ5 ప్లాట్‌ఫామ్ ఓటీటీ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
విడుదల మూవీని జీ5 ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్ చేస్తోన్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 20 వరకు తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీని ఉచితంగా చూడొచ్చని తెలిపింది.
నలభై కోట్ల కలెక్షన్స్...
పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన విడుదల మూవీ 40 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. వెట్రిమారన్ కథ, విజయ్ సేతుపతి, సూరి యాక్టింగ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. పార్ట్ వన్ సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్‌పై తమిళంలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో మాత్రం మోస్తారు బజ్‌తో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
విడుదల కథ ఇదే...
కమరేషన్ (సూరి) పోలీస్ కానిస్టేబుల్‌గా కొత్తగా ఉద్యోగంలో చేరుతాడు. ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్‌ను (విజయ్‌సేతుపతి) పట్టుకోవాలనే లక్ష్యంతో జాబ్‌లో చేరిన కమరేషన్‌కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతాయి. అతడి దూకుడు నచ్చని పై అధికారులు కమరేషన్‌కు డ్రైవర్ విధులు అప్పగిస్తారు.
పాప (భవానీ శ్రీ) అనే గిరిజన యువతితో కమరేషన్‌కు ఏర్పడిన స్నేహం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత ఏమైంది. అధికారుల ఒత్తిడిని తట్టుకుంటూ పెరుమాళ్‌ను కమరేషన్ ఎటా పట్టుకున్నాడు? అన్నదే విడుదల మూవీలో వెట్రిమారన్ చూపించాడు.
పెరుమాల్ పోరాటం...
అగ్ర వర్ణాల వివక్షను ఎదుర్కొంటూ పెరుమాళ్ సాగించిన పోరాటాన్ని సీక్వెల్‌లో వెట్రిమారన్ చూపించబోతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. పెరుమాళ్‌ను పట్టుకోవాలని అనుకున్న కమరేషన్ పోలీసుల బారి నుంచి అతడిని ఎలా కాపాడాడు అన్నది ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. విడుదల 2 మూవీకి ఇళయరాజా మ్యూజిక్ అందిస్తోన్నాడు.
విజయ్ సేతుపతి తనయుడు...
ఈ సీక్వెల్‌లో విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి గెస్ట్ రోల్‌లో కనిపింబోతున్నాడు. మంజు వారియర్, భవానీశ్రీ, గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.