Upendra: నా సినిమా రిలీజ్‌కు అన్‌ఫిట్ అని సెన్సార్ వాళ్లు అన్నారు - యూఐ ప్రమోషన్స్‌లో ఉపేంద్ర కామెంట్స్
Upendra: యూఐ మూవీని ప్రభాస్ కల్కితో కంపేర్ చేస్తూ జరుగుతోన్న ప్రచారంపై హీరో ఉపేంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓం మూవీ నుంచే సెన్సార్ పరంగా తన సినిమాలకు సమస్యలు ఎదురవుతూ వస్తోన్నాయని చెప్పాడు. ఉపేంద్ర యూఐ మూవీ డిసెంబర్ 20న తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో రిలీజ్ కాబోతోంది.
ఉపేంద్ర హీరోగా నటించిన యూఐ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఉపేంద్రనే స్వయంగా దర్శకత్వం వహించాడు. తెలుగు ప్రమోషన్స్‌లో యూఐ మూవీతో పాటు తన సినీ జర్నీపై ఉపేంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
కల్కితో కంపేరిజన్స్...
ప్రభాస్ కల్కితో యూఐ మూవీపై కంపేరిజన్స్ రావడంపై ఉపేంద్ర మాట్లాడుతూ...-ప్రభాస్ మూవీ మైథిలాజికల్ కల్కి అయితే నాది సైకలాజికల్ కల్కి. మన ఎడ్యుకేషన్ సిస్టం లో ఏ ఫర్ ఆపిల్.. బి ఫర్ బ్యాట్.. ఇలా నేర్పించారు. వాళ్లు ఏం చెప్తే అది బట్టి పడుతూ నేర్చుకున్నాం. అదొక సిస్టంలాగా మారిపోయింది. ఈ రొటీన్ సిస్టమ్ వలన థింకింగ్ కెపాసిటీ తగ్గిపోయింది.
అప్పుడే ఏ ఫర్ ఆపిల్ తో ఇంకొన్ని వర్డ్స్ చెప్పుంటే మన ఆలోచన మరోలా ఉండేది. నా కథల్లో కూడా అలాంటి ఏదైనా ఒక కొత్త ఆలోచననే చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటాను. యూఐ టైటిల్ కూడా అలాంటి ఆలోచనతోనే పెట్టాను. ఇది ఆడియన్స్ తో ఇంటరాక్టివ్ అయ్యే సినిమా. చూస్తున్నప్పుడు ప్రేక్షకులే చాలా విషయాల్ని డీకోడ్ చేస్తారు. చాలా మెటాఫరికల్ ఉంటుంది అని అన్నాడు.
ఆడియెన్స్ అసలైన స్టార్స్...
థియేటర్లో కూర్చుని సినిమా చూసిన ఆడియన్స్ నా దృష్టిలో అసలైన స్టార్స్.మొదటి సినిమాతోనే ఆ విషయం అర్థమైంది. ఆడియన్స్ ఫిలిం మేకర్ కంటే ఎప్పుడు ఓ మెట్టు పైనే ఉంటారు. . నా మనసులో ఉన్న ఆలోచనలను, ఊహల్ని సినిమాల ద్వారా చెబుతోన్నాను. అవన్నీ ప్రేక్షకులకు నచ్చడం ఆనందంగా ఉంది.
యూఐ రన్‌టైమ్...
యూఐ రన్‌టైమ్ టు అవర్స్ టెన్ మినిట్స్ ఉంటుంది. నాకు ఏదైనా విషయాన్ని లాగ్ చేసి చెప్పడం ఇష్టం ఉండదు. సినిమా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నా సినిమాలతో ఎలాంటి మెసేజ్ ఇవ్వను. తీసుకోను. ఈ సినిమాలో కూడా అదే చెప్పాను. అమీర్‌ఖాన్‌కు ఈ సినిమా నచ్చడం ఆనందంగా అనిపించింది.
అన్‌ఫిట్ అన్నారు...
కెరీర్ ఆరంభంలో నా సినిమాలకు సెన్సార్ నుంచి చాలా సమస్యలు ఎదురయ్యాయి. డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ ఓం కోసమే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత నేను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఏ సినిమా చూసి థిస్ ఫిల్మ్ ఇస్ అన్ ఫిట్ ఫర్ రిలీజ్ అని సెన్సార్ వాళ్లు వెళ్ళిపోయారు. తర్వాత రివైజ్ కమిటీ సహకారంతో రిలీజ్ చేశా. నా కథలు, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటాయి. బహుశా అందుకే అలా రియాక్ట్ అయి ఉంటారని భావించాను. యూఐ సినిమాకు సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ చెప్పలేదు.
రజనీకాంత్ ఏకలవ్య శిష్యుడిని...
రజనీకాంత్‌కు నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయనతో కలిసి సినిమా చేయాలనే డ్రీమ్ కూలీతో నెరవేరనుంది. ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి. కన్నడ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను.