Atul Subhash case : ఎట్టకేలకు అతుల్ సుభాష్ భార్య అరెస్ట్- అత్త, బావమరిది కూడా!
Atul Subhash case update : బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య నికితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె తల్లి, సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు.
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీలక అప్డేట్! సుభాష్ భార్య నికితా సింఘానియాని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను సైతం అరెస్టు చేశారు. భార్య నికితా, ఆమె కుటుంబసభ్యులు తనని వేధిస్తున్నట్టు అతుల్ సుభాష్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
హరియాణా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో..
అతుల్ సుభాష్ భార్య నికితను హరియాణాలోని గురుగ్రామ్‌లో అరెస్టు చేశారు. ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు.
అతుల్ సుభాష్ విడాకులు, పిల్లల సంరక్షణపై వివాదాస్పద న్యాయపోరాటంలో సతమతమయ్యాడని, ఇది అతని మానసిక క్షోభకు కారణమైందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబ సభ్యులపై ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు నమోదు చేశారు. వీరందరినీ మారతహళ్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చారు. ఈ కేసులో నిందితులను గుర్తించడానికి బెంగళూరు పోలీసులు తమ ఉత్తర ప్రదేశ్ సహచరుల సహాయం తీసుకోవాలని నిర్ణయించిన తరువాత ఈ అరెస్టులు జరిగాయి.
అతుల్‌పై ఉన్న కేసులను ఉపసంహరించుకోవడానికి రూ.3 కోట్లు, తన కుమారుడిని చూసేందుకు విజిటింగ్ రైట్స్ కోసం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతుల్ సుభాష్ మృతి నేపథ్యంలో నికిత, ఆమె బంధువులకు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే, తాము నిర్దోషులమని పేర్కొంటూ నికిత కుటుంబం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది.
అతుల్ సుభాష్‌పై సింఘానియా కుటుంబం 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నంకోసం వేధింపులు, దాడి చేశాడని నికితా సింఘానియా 2022లో చేసిన ఫిర్యాదులో పేర్కొంది. అతుల్ సుభాష్ భార్యాభర్తల సంబంధాన్ని మృగంలా చూశాడని, కట్నం కోసం అతని కుటుంబం వేధించడంతో తన తండ్రి స్ట్రోక్‌కు గురై చనిపోవడని ఆమె ఆరోపించింది.
బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అతుల్ సుభాష్ (32), మున్నేకొల్లులో నివాసముండేవాడు. సోమవారం తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. దానికి ముందు అతను చేసిన గంట యూట్యూబ్ వీడియోలో భార్య - ఆమె కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అతని ఇంట్లో పోలీసులు ఒక వివరణాత్మక నోట్‌ని కనుగొన్నారు. ప్రతి పేజీలో "న్యాయం జరగాలి" అని రాసి ఉంది. ఈ వార్త సంచలనం సృష్టించింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. నికిత, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌పై అతుల్ సోదరుడు ఫిర్యాదు చేశారు.
సంబంధిత కథనం