IMD rain alert : ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్- ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు..
ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో డిసెంబర్ 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలతో పలు జిల్లాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడి పంటలు, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది.
తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో డిసెంబర్ 19 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మరీ ముఖ్యంగా డిసెంబర్ 17, 18 తేదీల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, డిసెంబర్ 16-19 తేదీల మధ్య అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
డిసెంబర్ 16, 17 తేదీల్లో మత్స్యకారులు పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోకి లేదా డిసెంబర్ 17, 18 తేదీల్లో తమిళనాడు తీరం, కొమోరిన్ ప్రాంతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్లోకి వెళ్లరాదని సూచించారు.
ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్..
డిసెంబర్ 16న భారీ వర్షాలు: తమిళనాడులోని రామనాథపురం, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై జిల్లాలు, కరైకల్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తమిళనాడు అధికారిక ప్రకటనలో తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
డిసెంబర్ 17: తమిళనాడులోని నాగపట్నం, తిరువారూర్, కడలూరు, మైలాదుతురై జిల్లాలతో పాటు కరైకల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులోని అరియలూరు, తంజావూరు, పెరంబలూరు, పుదుకోట్టై, తిరుచిరాపల్లి, విల్లుప్పురం, చెంగల్పట్టు, కల్లకురిచ్చి జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 18: తమిళనాడు, పుదుచ్చేరిలోని కడలూరు, విల్లుపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 19: కేరళలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలకు నష్టం కలుగుతుందా?
రానున్న రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో రహదారులు స్థానికంగా నిండిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అండర్ పాస్లు జలమయం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
భారీ వర్షాల కారణంగా ఒక్కోసారి దృశ్యమానత తగ్గుతుంది.
ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణ సమయం పెరగొచ్చు. బలహీనమైన నిర్మాణాలకు సంభావ్య నష్టం జరగొచ్చు.
స్థానికంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంది. వరదల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కొన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు ఏర్పడవచ్చు (మరింత సమాచారం కోసం, సీడబ్ల్యూసీ వెబ్సైట్ని సందర్శించండి).
సంబంధిత కథనం