Fire accident : తమిళనాడు ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం- ఏడుగురు దుర్మరణం..
Tamil Nadu hospital fire : తమిళనాడు దిండిగల్ ఓ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. 20మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.
తమిళనాడు దిండిగల్‌లోని ఓ ప్రైవేట్ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారి, ఒక మహిళ సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
ఈ ఆసుపత్రి దిండిగల్-తిరుచ్చి రహదారి మార్గంలో ఉంది. అయితే ఇది దిండిగల్ నగర పరిధిలోకి వస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పొగలు, మంటలు వస్తున్నట్లు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సంఘటనాస్థలానికి చేరుకుంది.
హాస్పిటల్లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు బాధితులు లిఫ్ట్‌లో అపస్మారక స్థితిలో కనిపించారు. అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు, అప్పటికే వారు మృతి చెందినట్లు ప్రకటించారు.
ఊపిరాడకపోవడమే మరణానికి కారణమని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ సిబ్బంది సుమారు 30 మంది రోగులను ఆసుపత్రి నుంచి బయటకు తీశారు. వీరిని వేరే ఆసుపత్రికి తరలించడానికి ప్రైవేట్ అంబులెన్స్‌లతో సహా 50కి పైగా అంబులెన్సులను రాత్రికి రాత్రే పిలిపించారు.
రక్షించిన వారిలో ఎక్కువ మందిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
మరికొంత మంది రోగులను రక్షించి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించినట్లు దిండిగల్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ పూంగోడి తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
దిండిగల్ నగర పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించనున్నారు. ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో..
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం వార్తలు ఇటీవలి కాలంలో దేశంలో వినిపిస్తూనే ఉంటున్నాయి. యూపీ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో గత నెలలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఐదు నెలల క్రితం నిర్వహించిన సేఫ్టీ ఆడిట్ సిఫార్సులను ఆసుపత్రి అధికారులు పరిష్కరించి ఉంటే ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు) లో జరిగిన ఈ దుర్ఘటన సంభవించి ఉండేది కాదని తేలింది.
ఈ ఏడాది జూన్ 17, 18 తేదీల్లో ఝాన్సీలోని విద్యుత్ భద్రత అసిస్టెంట్ డైరెక్టర్ చంద్ర భూషణ్ చౌబే, ఝాన్సీలో విద్యుత్ సేఫ్టీ ఆఫీసర్ ములాయం సింగ్ యాదవ్ నిర్వహించిన తనిఖీ ఆధారంగా సేఫ్టీ ఆడిట్ నివేదికను రూపొందించారు.
అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఆడిటోరియం, అనాటమీ, పాథాలజీ ప్రాంతాలతో సహా బహుళ విభాగాలు, యూనిట్లలో తీవ్రమైన భద్రతా సమస్యలను నివేదిక హైలైట్ చేసింది. అనేక వైరింగ్ కనెక్షన్లలో లోపాలు బహిర్గతమయ్యాయని, జంక్షన్ బాక్సులు తెరిచి ఉన్నాయని, ఇది మంటల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వెల్లడించింది.
సంబంధిత కథనం