Sangareddy Crime : 3 లక్షల కట్నం, నెలకు రూ.30 వేలు ఇంటి ఖర్చులకు సాయం- ఇంకా కావాలని భర్త వేధింపులు, భార్య ఆత్మహత్య-sangareddy crime software engineer demands extra dowry wife suicide ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Crime : 3 లక్షల కట్నం, నెలకు రూ.30 వేలు ఇంటి ఖర్చులకు సాయం- ఇంకా కావాలని భర్త వేధింపులు, భార్య ఆత్మహత్య

Sangareddy Crime : 3 లక్షల కట్నం, నెలకు రూ.30 వేలు ఇంటి ఖర్చులకు సాయం- ఇంకా కావాలని భర్త వేధింపులు, భార్య ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu
Jul 28, 2024 02:29 PM IST

Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో ప్రేమ పెళ్లి విషాదాంతం అయ్యింది. పెళ్లైన ఐదు నెలల్లోని యువతి బలవన్మరణానికి పాల్పడింది. నెల నెలా ఖర్చులకు రూ.30 వేలు పంపిస్తున్నా...ఇంకా అదనపు కట్నం కావాలని, తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కావాలని భర్త వేధింపులతో యువతి ఆత్మహత్యకు చేసుకుంది.

సంగారెడ్డిలో విషాదం- ప్రేమ పెళ్లైన ఐదు నెలల్లోనే వరకట్న వేధింపులతో భార్య ఆత్మహత్య
సంగారెడ్డిలో విషాదం- ప్రేమ పెళ్లైన ఐదు నెలల్లోనే వరకట్న వేధింపులతో భార్య ఆత్మహత్య

Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లై ఐదు నెలలు నిండకుండానే భర్త ఆస్తిలో వాటా కావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో మనోవేదనకు గురైన భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో వెలుగు చూసింది.

మూడు లక్షల కట్నం ఇచ్చి

అమీన్ పూర్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా యర్లపాడు గ్రామానికి చెందిన అంగడి మహేష్, కొరివి హర్షిత (22) ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో పెద్దలకు తెలపడంతో వారు అంగీకరించారు. గత మార్చి నెలలో రూ. 3 లక్షల కట్నం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అనంతరం మహేష్, హర్షిత దంపతులు అమీన్పూర్ మండలంలోని పటేల్ గూడ సిద్ధార్థ ఎన్ క్లేవ్ లో నాలుగు నెలలుగా నివాసం ఉంటున్నారు.

ఖర్చుల నిమిత్తం నెలనెలా

పెళ్ళైనప్పటి నుంచి మహేష్ ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. దీంతో అత్తింటి వారు కూతురు బాధ చూడలేక ఖర్చుల నిమిత్తం నెలనెలా రూ. 30 వేలు పంపిస్తున్నారు. ఆ డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి మహేష్ కు నెల రోజుల కిందట సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఆఫర్ లెటర్ వచ్చింది. అయినా మహేష్ అత్తింటి వారిని నెల నెలా ఖర్చులకు డబ్బులు పంపాలని భార్యతో గొడవపడుతున్నాడు. అంతేకాకుండా వారికి ఉన్న ఆస్తిలో వాటా కావాలంటూ భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.

చున్నీతో ఉరి వేసుకొని

భర్త పెట్టే బాధలను తట్టుకోలేక హర్షిత శుక్రవారం రాత్రి బెడ్ రూమ్ లో కిటికీ ఊచలకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూతురి మరణ వార్త విన్న తల్లిదండ్రులు వెంటనే అమీన్పూర్ కి చేరుకున్నారు. ఆమె మృతదేహంపై పడి తీవ్రంగా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. హర్షిత తండ్రి అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్నవేధింపుల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆత్మహత్య

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొండపాక మండలంలోని బంధారానికి చెందిన శ్రీవాణి (24), అదే మండలంలో ఖమ్మంపల్లికి చెందిన నితీష్ సిద్దిపేటలో ఒకే కళాశాలలో చదువుకున్నారు . ఈ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సిద్దిపేటలో ఇంటర్ పూర్తి చేసిన యువతి డిగ్రీ కోసం హైదరాబాద్ వెళ్లింది. అయినా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తూనే ఉంది. హైదరాబాద్ లో చదువు ముగించుకుని ఈ మధ్యనే శ్రీవాణి బందారం గ్రామానికి వచ్చింది. అనంతరం యువతి పెళ్లి చేసుకుందామని నితీష్ ని కోరింది. అతడు ఇద్దరి కులాలు వేరని మా ఇంట్లో ఒప్పుకోరని, తనను పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీవాణి పురుగుల మందు తాగింది. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం రాత్రి మృతి చెందింది. కూతురు అర్ధాంతరంగా మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుణ్ణి అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం