Mulugu Accident: నెల రోజుల్లో పెళ్లి, అంతలోనే విషాదం.. చెట్టుకూలి పడటంతో యువకుడి మృతి
Mulugu Accident: నెల రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆ యువకుడిని విధి కాటేసింది. వారం రోజులుగా కురుస్తున్న ముసురువానలకు భారీ వృక్షం నేలకూలగా, అది మీద పడటంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Mulugu Accident: నెల రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆ యువకుడిని విధి కాటేసింది. వారం రోజులుగా కురుస్తున్న ముసురువానలకు భారీ వృక్షం నేలకూలగా, అది మీద పడటంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషాద ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చిన్న బోయినపల్లి శివారులో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన షేక్ సయ్యద్ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం ఉన్నారు.
అందులో కూతురు సల్మాకు గతంలోనే పెళ్లి చేసేవారు. ఇక పెద్ద కొడుకైన జహంగీర్(30) అనే యువకుడు బీ ఫార్మసీ పూర్తి చేశాడు. వివిధ కారణాలతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే బతుకుదెరువు కోసం చిన్న బోయినపల్లి గ్రామంలోనే ఓ మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకున్నాడు.
మెడికల్ షాప్ కు అవసరమైన మందులు తెచ్చుకునేందుకు గురువారం చిన్నబోయిన పల్లి నుంచి ఏటూరు నాగారం మండల కేంద్రానికి బయలు దేరాడు. జాతీయ రహదారి– 163పై తన బైక్ మీద వెళ్తుండగా మార్గ మధ్యలో పోతురాజు బోరు ఏరియా సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షం నేలకొరిగి జహంగీర్ పై పడింది. బైక్ పై వెళ్తున్న జహంగీర్ పైనే కూలి పడటంతో ఆయన తల బలంగా రోడ్డుకు ఢీకొంది. దీంతో తల పగిలి తీవ్ర రక్త స్రావం జరగగా, జహంగీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వ్యక్తులు గమనించి చిన్నబోయినపల్లి గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి చూడగా, అప్పటికే జహంగీర్ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం జహంగీర్ మృత దేహాన్ని వెలికి తీసి, పోస్టు మార్టం నిమిత్తం ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడు జహంగీర్ తండ్రి షేక్ సయ్యద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏటూరు నాగారం ఎస్సై తాజొద్దీన్ వివరించారు.
కొద్దిరోజుల్లోనే పెళ్లి..!
షేక్ సయ్యద్ దంపతులు ఇప్పటికే కూతురు వివాహం చేయగా, పెద్ద కుమారుడైనా జహంగీర్ కు కూడా పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సంబంధం కూడా కుదిర్చినట్లు తెలిసింది. ఆగస్టు నెలలో పెళ్లి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
కాగా నెల రోజుల్లోగా పెళ్లి కావాల్సిన యువకుడు అనూహ్యంగా చెట్టు కూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇదిలాఉంటే ప్రమాద సమయంలో జహంగీర్ తల బలంగా రోడ్డుకు ఢీ కొట్టగా, హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైన బాధితుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటుండటంతో వాహనదారులు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని పోలీసులు చెబుతున్నారు. బైక్ పై వెళ్లే సమయంలో తలకు హెల్మెట్ ధరించి, ప్రాణాలకు రక్షణ కల్పించుకోవాలని సూచిస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)