Leopard Roaming : భయపెడుతున్న వన్య మృగాలు- శ్రీశైలంలో చిరుత, భద్రాద్రి కొత్తగూడెంలో పెద్దపులి కలకలం
Leopard Roaming : తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వన్య మృగాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీశైలం, మహానందిలో చిరుత సంచారం కలకలం రేపగా..తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.
Leopard Roaming : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వన్య మృగాలు సంచారం కలకలం రేపుతోంది. ఏపీలోని శ్రీశైలం, మహానంది...తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ లో చిరుత, పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో చిరుత దాడిలో ఓ మహిళ గాయపడింది.
శ్రీశైలం మరోసారి చిరుత కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం సమీపంలో రోడ్డు పక్కన గోడపై చిరుత కనిపించిందని వాహనదారులు తెలిపారు. చిరుతను చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై కూర్చొన్న చిరుత పులిని వీడియోలు తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీశైలంలో చిరుత సంచారంతో ఆలయానికి వచ్చే భక్తులు భయాందోళన చెందుతున్నారు.
శ్రీశైలంలో ఇటీవల సైతం చిరుత సంచరించినట్లు వార్తలు వచ్చాయి. ఆర్టీసీ బస్టాండ్, ఏఈవో ఇంటికి సమీపంలో చిరుత కనిపించిందనే వార్తలు వైరల్ అయ్యాయి. భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ, శ్రీశైల దేవస్థానం అధికారులు సూచించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోనూ చిరుత సంచారం కలకలం రేపింది. గాజులపల్లి సమీపంలో స్థానికులు చిరుతను చూశారు. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బోను ఏర్పాటు చేసే వరకు స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాత్రుళ్లు ఒంటరిగా తిరగవద్దని హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి సంచారం
తెలంగాణలోని ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించిందని అటవీ అధికారులు తెలిపారు. పినపాక, ఇల్లందు, కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లుగా అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పెద్దపులి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తిరుగుతున్న పరిస్థితి ఉందన్నారు. గతంలో కరకగూడెం ఆళ్లపల్లి రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పులి సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు. తిరిపి మళ్లీ ఇప్పుడు పులి ఆనవాళ్లను అధికారులు గుర్తించారు.
గుండాల, అల్లపల్లి మండలాల్లో గత మూడు రోజులుగా పెద్ద పులి కలకలం రేపుతోంది. గుండాలకు సరిహద్దు అడవుల్లో పులి సంచరించినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి గుండాల ఆళ్లపల్లి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. అటవీ ప్రాంతం సమీపంలోన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
మహిళపై చిరుత దాడి
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం డేడ్రా గ్రామంలో ఓ మహిళపై చిరుత దాడి కలకలం రేపుతోంది. అర్క భీమ్ బాయి(55) శనివారం ఉదయం 5 గంటలకు గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్తున్న క్రమంలో చిరుత పులి దాడి చేయడంతో బిగ్గరగా కేకలు వేసింది. కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకునేలోపే చిరుత సమీపంలోని అడవిలోకి పారిపోయింది. చిరుత దాడిలో మహిళ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను బజార్ హత్నూర్ లోని పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అటవీ శాఖ నుంచి తక్షణ సాయం కింద రూ.10 వేలు అందజేసినట్లు అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం