Karimnagar Crime : మావోయిస్ట్ అగ్రనేత స్వగ్రామంలో దొంగలు హల్ చల్, తుపాకులతో బెదిరించి చోరీ
Karimnagar Crime : మావోయిస్టు అగ్రనేత స్వగ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. తుపాకులతో బెదిరించి దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. అపహరించిన సొత్తు తక్కువే అయినా గన్నులు పెట్టి బెదిరించి దాడి చేసి చోరీకి పాల్పడి పోలీసుల పెను సవాల్ విసిరారు.
Karimnagar Crime : మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి స్వగ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్ పూర్. ఒకప్పుడు మావోయిస్టులు, ఇప్పుడు పోలీసులు నిత్యం సంచరించే ఆ గ్రామంలో తాజాగా దొంగలు కలకలం సృష్టించారు. తెల్లవారుజామున రెండు బైక్ లపై వచ్చిన నలుగురు వ్యక్తులు హల్చల్ చేశారు. కాసం ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంట్లో చొరబడ్డ దొంగలు... తుపాకులతో బెదిరించారు. నలుగురు గన్నులతో దాడి చేసి నోట్లో గుడ్డలు కుక్కి చోరీకి పాల్పడ్డారని బాధితుడు ఈశ్వరయ్య తెలిపారు. రక్తం గాయాలైన ఈశ్వరయ్య ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు సుమారు 7 తులాలు ఎత్తుకెల్లినట్లు బాధితుడు చెప్పారు. అందరూ నిద్ర మేలుకొని దినచర్యలో నిమగ్నమయ్యే వేళ గన్నులు పెట్టి బెదిరించి దాడి చేసి చోరీ చేయడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. జరిగిన ఘటనను తలుచుకుని గ్రామీణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ
మావోయిస్టు అగ్రనేత స్వగ్రామంలో గన్నులతో సంచరించి చోరీకి పాల్పడడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తుంది. ప్రస్తుతం బీర్పూర్ గ్రామం మండల కేంద్రంగా మారి అక్కడే ఒక పోలీస్ స్టేషన్ ఉండగా రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ చేసినప్పటికీ తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు చోరీ జరగడం సంచలనంగా మారింది. జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్ సీఐ కృష్ణారెడ్డి బీర్పూర్ గ్రామాన్ని సందర్శించి చోరీ జరిగిన ఈశ్వరయ్య ఇంటిని పరిశీలించారు. గాయాల పాలైన ఈశ్వరయ్యను విచారించి చోరీ జరిగింది వాస్తవమేనని గుర్తించి చోరీకి పాల్పడ్డది ఎవరనేది విచారణ చేపట్టారు.
గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పుట్టేజ్ ను పరిశీలించగా అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో రెండు బైకులపై నలుగురు సంచరించినట్లు రికార్డు అయింది. అదేవిధంగా తెల్లవారుజామున 5 గంటల 30 నిముషాలకు బైక్ ను నెట్టుకుంటూ ఇద్దరు గ్రామంలోకి వచ్చినట్లు రికార్డు అయింది. వారే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తూ దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే చోరీకి పాల్పడ్డ వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు భయపడవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మావోయిస్టు అగ్రనేత స్వగ్రామంలో దొంగల అలజడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం