Scholarships for students : విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం స్కాలర్షిప్స్- ఈ స్కీమ్‌తో అనేక ప్రయోజనాలు..
PM Uchchatar Shiksha Protsahan : కేంద్రం ఇస్తున్న ఒక పథకం ద్వారా పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ చదువును ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించుకోవచ్చు. ప్రధాన మంత్రి ఉచ్ఛతార్ శిక్షా ప్రోత్సాహన్ వివరాలు..
ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థులు చదువుకు దూరంకాకూడదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా వారికి స్కాలర్షిప్స్ ఇస్తోంది. వాటిల్లో ఒకటి.. పీఎం ఉచ్చతార్ శిక్షా ప్రోత్సాహన్. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కనేప్పటికీ ఆర్థిక ఇబ్బందులుతో తమ ఆశయాలను నెరవేర్చుకోవడంలో విఫలమయ్యే విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
పీఎం యూఎస్పీ..
కళాశాలలు, విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం ప్రధాన మంత్రి ఉచ్ఛతార్ శిక్షా ప్రోత్సాహన్ (పీఎం-యూఎస్పీ) సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యా విభాగానికి చెందిన పథకం.
పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువులు చదివేటప్పుడు వారి రోజువారీ ఖర్చులలో కొంత భాగాన్ని భరించడానికి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం.
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాదికి గరిష్టంగా 82,000 కొత్త స్కాలర్షిప్స్ అందిస్తారు.
అర్హతలు:
ఈ స్కాలర్షిప్ స్కీమ్‌ని పరిగణనలోకి తీసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి..
- అభ్యర్థులు సంబంధిత బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి 10+2 నమూనాలో 12వ తరగతిలో సంబంధిత విభాగంలో 80వ పర్సంటైల్ కంటే ఎక్కువ ఉండాలి. హయ్యర్ సెకండరీ/ 12వ తరగతి బోర్డు ఎగ్జామినేషన్ ఫలితాల ఆధారంగా అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తారు.
- అభ్యర్థులు రెగ్యులర్ డిగ్రీ కోర్సులు చేస్తూ ఉండాలి.
- అభ్యర్థులు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సంబంధిత రెగ్యులేటరీ బాడీస్ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో కోర్సులు అభ్యసించి ఉండాలి.
- దరఖాస్తుదారుడి స్థూల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.4,50,000 మించరాదు.
- వార్షిక పరీక్షలో కనీసం 50% మార్కులు సాధించడంతో పాటు ప్రతి సంవత్సరం చదువుతున్నప్పుడు అభ్యర్థి స్కాలర్షిప్ పునరుద్ధరించాలనుకుంటే, తగినంత అటెండెన్స్ కనీసం 75% ఉండాలి.
- దరఖాస్తుదారుడు వారి పేరు మీద బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి.
దరఖాస్తుకు అనర్హులు:
ఈ విద్యార్థులు స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
- కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ మోడ్ లేదా డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులు.
- ఇప్పటికే ప్రభుత్వ ఉపకార వేతనాలు, ఫీజు మాఫీ, రీయింబర్స్ మెంట్ పథకాలతో సహా ఇతర స్కాలర్షిప్ పథకాల నుంచి లబ్ధి పొందుతున్న విద్యార్థులు.
అవసరమైన పత్రాలు:
స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఈ పత్రాలను సమర్పించాలి.
- బ్యాంకు వివరాలు నింపడానికి బ్యాంక్ పాస్‌బుక్
- ఆధార్ నెంబర్
- తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం
- ఈ-మెయిల్ ఐడీ
- అవసరమైన చోట కుల ధృవీకరణ పత్రం
- అవసరమైన చోట అంగవైకల్య ధృవీకరణ పత్రం
మరింత సమాచారం కోసం, అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
సంబంధిత కథనం