IND vs AUS 3rd Test Day 2:గబ్బాలో ఆస్ట్రేలియా సెంచరీల మోత.. ప్రేక్షకుల్లా మారిన భారత్ బౌలర్లు-india vs australia 3rd test day 2 aus ride on travis head steve smith tons to reach 405 runs at stumps ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 3rd Test Day 2:గబ్బాలో ఆస్ట్రేలియా సెంచరీల మోత.. ప్రేక్షకుల్లా మారిన భారత్ బౌలర్లు

IND vs AUS 3rd Test Day 2:గబ్బాలో ఆస్ట్రేలియా సెంచరీల మోత.. ప్రేక్షకుల్లా మారిన భారత్ బౌలర్లు

Galeti Rajendra HT Telugu
Dec 15, 2024 03:34 PM IST

India Vs Australia 3rd Test Day 2: ట్రావిస్ హెడ్ భారత్‌పై వరుసగా రెండో సెంచరీ బాదేశాడు. అడిలైడ్ టెస్టులో 150 పరుగులు చేసిన హెడ్.. ఈరోజు గబ్బా టెస్టులోనూ 152 పరుగులు చేశాడు. దాంతో..?

మూడో టెస్టులో రెండో రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం
మూడో టెస్టులో రెండో రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం (AFP)

ఆస్ట్రేలియా గడ్డపై భారత్ బౌలర్లు మరోసారి సమష్టిగా రాణించడంలో విఫలమయ్యారు. గబ్బా వేదికగా శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో.. రెండో రోజైన ఆదివారం ఓవర్ నైట్ స్కోరు 28/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు.. ఈరోజు ఆట ముగిసే సమయానికి 405/7తో తిరుగులేని స్థితిలో నిలిచింది.

మూడో వికెట్‌కి 241 పరుగులు

ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (152: 160 బంతుల్లో 18x4) బ్యాక్ టు బ్యాక్ సెంచరీ నమోదు చేయగా.. చాలా రోజుల తర్వాత స్టీవ్‌స్మిత్ (101: 190 బంతుల్లో 12x4) క్లాస్ శతకం బాదాడు. ఈ ఇద్దరూ దాదాపు 50 ఓవర్లు భారత్ జట్టుకి ఈరోజు వికెట్ ఇవ్వకుండా.. నాలుగో వికెట్‌కి అభేధ్యంగా 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ (45 బ్యాటింగ్), మిచెల్ స్టార్క్ (7 బ్యాటింగ్) ఉన్నారు.

బుమ్రా ఒక్కడే 5 వికెట్లు

శనివారం వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవగా.. ఈరోజు మూడు సెషన్ల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగింది. అయితే.. భారత్ జట్లు బౌలర్ల ఉదాసీనతని సొమ్ము చేసుకున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేశారు. ఒక ఎండ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (5/72) వరుస విరామాల్లో ఈరోజు ఆరంభంలోనే వికెట్లు పడగొట్టినా.. అతనికి సహకరించే బౌలర్లు టీమ్‌లో కరవయ్యారు.

చేతులెత్తేసిన ఆకాశ్, జడేజా

హర్షిత్ రాణా స్థానంలో టీమ్‌లోకి వచ్చిన ఆకాశ్ దీప్ 24.4 ఓవర్లు బౌలింగ్ చేసి కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అలానే మహ్మద్ సిరాజ్ 22.2 ఓవర్లు వేసినా.. తీసింది ఒక్క వికెట్ మాత్రమే. అది కూడా ఈరోజు ఆట ముగుస్తున్న దశలో పాట్ కమిన్స్ వికెట్‌. ఇక అశ్విన్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన జడేజా 16 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో బుమ్రా బౌలింగ్‌లో కాస్త జాగ్రత్తగా ఆడిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. మిగిలిన బౌలర్లతో ఆట ఆడేసుకున్నారు.

ఆఖర్లో అలెక్స్ దూకుడు

ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా (21), నాథన్ మెస్వీనే (9), మార్కస్ లబుషేన్ (12) తక్కువ స్కోరుకే ఔటైనా.. భారత్ బౌలర్లు ఉదాసీనతతో పుంజుకున్న ఆస్ట్రేలియా రెండో రోజు మెరుగైన స్కోరుని అందుకోగలిగింది. ట్రావిస్ హెడ్, స్టీవ్‌ స్మిత్ శతకాల తర్వాత.. మిచెల్ మార్ష్ (5), పాట్ కమిన్స్ (20) తక్కువ స్కోరుకే ఔటైనా.. అలెక్స్ క్యారీ దూకుడుగా ఆడి ఆస్ట్రేలియా టీమ్ స్కోరుని 400 దాటించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగుతున్న వేళ.. భారత్ బౌలర్లు ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు.

ఐదు టెస్టుల ఈ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. దాంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.

Whats_app_banner