Bigg Boss Telugu Finale: బిగ్‌బాస్ ఫినాలే ముంగిట పోలీసులు వార్నింగ్.. గత ఏడాది జరిగిన రచ్చ గుర్తుందా?
Bigg Boss 8 Finale: బిగ్‌బాస్ 8 విన్నర్ ఎవరో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే.. గత ఏడాది తరహాలో విన్నర్ ప్రకటన తర్వాత హైదరాబాద్ రోడ్లపై అభిమనులు రచ్చ చేయకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బిగ్‌బాస్ ఫినాలే ముంగిట తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెప్టెంబరు నుంచి జరుగుతున్న బిగ్‌బాస్ సీజన్ 8 ఆదివారంతో ముగియనుంది. ఈరోజు ఫినాలేతో బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తేలిపోనుండగా.. గత ఏడాది జరిగిన రచ్చతో ఈసారి పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే ఏదైనా గొడవ, రచ్చ జరిగితే బిగ్‌బాస్ నిర్వాహకుల్ని బాధ్యుల్ని చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.
గత ఏడాది రచ్చరచ్చ
2023, డిసెంబరులో బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే.. ట్రోఫీ తీసుకుని పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చాక అతని అభిమానుల రచ్చ మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అప్పుడే బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేసిన కొంత మంది అభిమానులు.. ఆ క్రమంలో 7 ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. దాంతో ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
300 మందితో బందోబస్తు
అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు.. దాదాపు 300 మంది పోలీసులతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలానే బిగ్‌బాస్ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత.. అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరికి రావొద్దని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. బిగ్‌బాస్ విన్నర్‌కి మద్దతుగా సిటీలో ర్యాలీలు, ఊరేగింపులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇస్తున్నారు.
బిగ్‌బాస్ ఫైనలిస్ట్‌లు
అన్నపూర్ణ స్టూడియోస్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటన చోటు చేసుకున్నా.. దానికి బిగ్‌బాస్ నిర్వాహకులు బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా పోలీసులు ముందే హెచ్చరిస్తున్నారు. బిగ్‌బాస్ ఫైనలిస్ట్‌లుగా నిఖిల్, అవినాష్, గౌతమ్, నబీల్, ప్రేరణ ఉన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఫినాలే ప్రారంభంకానుంది.