CM Chandrababu : త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు
CM Chandrababu : పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగంతోనే మనమంతా తెలుగు వాళ్లమని చెప్పుకుంటున్నామన్నారు. త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
CM Chandrababu : స్వాతంత్ర్య సమర యోధుడు, మానవతావాది పొట్టి శ్రీరాములు త్యాగం మన తరతరాలు గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని.. దేశం కోసం, రాష్ట్రం కోసం పాటుపడదామన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
2019 తర్వాత మూడు రాజధానుల పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. గతత ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలు గడిచిందని, ఈ సమయం అంతా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడమే సరిపోయిందన్నారు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తే అందులో ప్రజలు భాగస్వామ్యం కావొద్దన్నారు.
త్వరలోనే ఏపీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే రోజు నేడు అన్నారు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన గొప్ప పోరాటం మరువలేనిదన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే ఈనాడు మనమంతా తెలుగు వాళ్లమని చెప్పుకుంటున్నామన్నారు. తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ఆలోచన చేసి ప్రాణత్యాగం చేశారన్నారు. 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారన్నారు.
పొట్టి శ్రీరాములు ఆంధ్ర జాతికి నాయకుడు - పవన్ కల్యాణ్
పొట్టి శ్రీరాములు ఒక జాతికి, కులానికి నాయకుడు కాదు, ఆయన ఆంధ్ర జాతికి నాయకుడని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.అలాగే స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో 562 రాజ్య సంస్థానాలను విలీనం చేసి బలమైన భారతదేశాన్ని నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కీర్తించారు. ప్రతీ ఒక్కరికీ అభివృద్ది ఫలాలు అందించేలా, అన్ని రంగాలకు సమగ్రాభివృద్ధి దిశగా తీసుకెళ్లేలా రాష్ట్రాన్ని 2.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టే దిశగా స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 అమలు చేసి లక్ష్యాలు సాధించడమే పొట్టి శ్రీరాములకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 అన్ని వర్గాలకు సమగ్ర అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చామమన్నారు. దీని మీద ఎవరైనా విమర్శలు చేస్తే అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు.
"రాష్ట్ర విభజన తర్వాత పొట్టి శ్రీరాములు త్యాగం విలువ అర్థమైంది. ఆయన 58 రోజుల పాటు కఠోర ఆమరణ నిరహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం సిద్దించేలా చేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం తరవాత ఆయన భౌతిక కాయం మొయ్యడానికి కూడా నలుగురు లేని పరిస్థితి బాధాకరం. ఘంటసాల లాంటి కొంతమంది మహానుభావులు ఆరోజు నిలబడ్డారు. ఆయన త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్రం. మద్రాసులో తెలుగు వారిని మద్రాసీలు అంటుంటే, నేను తెలుగువాడిని అని ఆత్మగౌరవంతో నినదించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు"- పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం
సంబంధిత కథనం