Mohammed Siraj Bail Switch: స్టంప్స్‌పై బెయిల్స్ మార్చి.. ఆస్ట్రేలియా బ్యాటర్‌ను బుట్టలో వేసిన సిరాజ్.. వీడియో వైరల్
Mohammed Siraj Bail Switch: మహ్మద్ సిరాజ్ గొడవ పడటానికి వస్తున్నాడని భావించిన లబుషేన్ ప్రిపేర్ అయ్యాడు. కానీ.. సైలెంట్‌గా వచ్చిన సిరాజ్ బెయిల్స్‌ను అటు ఇటు మార్చి వెళ్లిపోయాడు. ఇక్కడే లబుషేన్ అతని బుట్టలో పడ్డాడు. ఎలా అంటే?
ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వ్యూహం ఫలించింది. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్కస్ లబుషేన్ ఏకాగ్రతని చెదరగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే మహ్మద్ సిరాజ్ వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను మార్చాడు. అతని ట్రిక్ ఫలించి.. నెక్ట్స్ ఓవర్‌లోనే లబుషేన్ ఔట్ అయ్యాడు. దాంతో.. లబుషేన్ తీరుపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇటీవల రెండో టెస్టులో ట్రావిస్ హెడ్‌తో గొడవపడిన మహ్మద్ సిరాజ్.. అతడ్ని క్లీన్ బౌల్డ్ చేసిన విషయం తెలిసిందే.
గొడవ పడతాడనుకుంటే.. సైలెంట్‌గా
మ్యాచ్‌లో ఈరోజు లబుషేన్ 55 బంతుల్లో కేవలం 12 పరుగులే చేశాడు. క్రీజులో పాతుకుపోయిన తర్వాత భారీ ఇన్నింగ్స్ ఆడే నైజమున్న లబుషేన్ గురించి తెలిసే.. సిరాజ్ బెయిల్స్ మార్చే ట్రిక్ ప్రయోగించాడు. ఇన్నింగ్స్ 32వ ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్ చేస్తూ.. ఒక బంతిని విసిరిన తర్వాత లబుషేన్ దగ్గరికి వచ్చాడు. దాంతో లబుషేన్ తనతో గొడవపడటానికే సిరాజ్ వస్తున్నాడని భావించి.. ఆవేశంగా అతనివైపు చూస్తూ మరింత రెచ్చగొట్టాడు. అయితే.. సిరాజ్ మాత్రం మౌనంగా వెళ్లి స్టంప్స్‌పై ఉన్న బెయిల్స్‌ను అటు ఇటు మార్చాడు.
బెయిల్స్ మారిస్తే నష్టమేంటి?
వాస్తవానికి అలా బెయిల్స్ మార్చడం వల్ల సిరాజ్‌కి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. స్టంప్స్‌పై ఉండే బెయిల్స్ రెండూ సమానమే. కానీ.. లబుషేన్ ఏకాగ్రతని దెబ్బతీయడానికి సిరాజ్ ఆ పని చేశాడు. అతను ఆశించినట్లే.. సిరాజ్ బెయిల్స్ మార్చి వెళ్లగానే క్షణాల్లో మళ్లీ బెయిల్స్‌ను మునుపటిలా లబుషేన్ మార్చి అతని బుట్టలో పడ్డాడు. అప్పటి వరకూ బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టిన లబుషేన్ ఒక్కసారి దృష్టి మరల్చి.. నెక్ట్స్ ఓవర్‌లోనే విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు.
ఎందుకు స్పందించావ్?
బెయిల్స్ మార్పుపై లబుషేన్ అస్సలు స్పందించకుండా ఉండాల్సిందని.. కేవలం ఏకాగ్రతని దెబ్బతీయడానికే సిరాజ్ అలా చేశాడనే విషయం అర్థం చేసుకుని ఉంటే వికెట్ కాపాడుకునేవాడని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలర్ ఇలా చేసుంటే పట్టించుకునేవాడిని కాదని..అసలు బౌలర్ వైపు కూడా చూసి ఉండేవాడిని కాదని హెడెన్ వెల్లడించాడు.
ఈరోజు ఓవర్ నైట్ స్కోరు 28/0తో తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు ట్రావిస్ హెడ్ (152: 160 బంతుల్లో 18x4), స్టీవ్‌స్మిత్ (101: 190 బంతుల్లో 12x4) సెంచరీలు బాదడంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి 405/7తో నిలిచింది.