Smart Ring : డిస్‌ప్లేతో స్మార్ట్ రింగ్.. నీటిలోనూ పని చేస్తుంది.. అనేక ఫీచర్లు!
Smart Ring : టెక్నాలజీ మారుతోంది. దానికి తగ్గట్టుగానే కొత్త కొత్త ఆవిష్కరణలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. తాజాగా స్మార్ట్ రింగ్ మార్కెట్‌లోకి వచ్చింది. దీంట్లో అనేక ఫీచర్లు ఉన్నాయి.
రోగ్‌బిడ్ అత్యంత ప్రత్యేకమైన ఉంగరాన్ని రూపొందించింది. రోగ్‌బిడ్ ఎస్ఆర్ 08 అల్ట్రా పేరుతో కొత్త స్మార్ట్ రింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. డిస్‌ప్లేతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్ రింగ్ ఇదే కావడం దీని ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది. ఈ డిస్‌ప్లేలో యూజర్లు పలు ముఖ్యమైన సమాచారాన్ని చూడవచ్చు. ఈ స్మార్ట్ రింగ్ చూసేందుకు అందంగా ఉండటమే కాకుండా అనేక రకాల సైజుల్లో కొనుగోలు చేయవచ్చు. ఛార్జింగ్ విషయానికొస్తే.. మొత్తం 20 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రత్యేకమైన స్మార్ట్ రింగ్ గురించి వివరంగా తెలుసుకుందాం...
రోగ్‌బిడ్ SR088 అల్ట్రా టైటానియం అల్లాయ్ కేసింగ్‌ను కలిగి ఉంది. చాలా దృఢంగా ఉంటుంది. ఇది 5 ఎటిఎం వాటర్ ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది. అంటే 50 మీటర్ల లోతైన నీటిలో మునిగినా దీనికి ఏం జరగదు. 8.0 మిల్లీమీటర్ల వెడల్పు, 2.5 మిల్లీమీటర్ల మందం కలిగిన ఈ ఉంగరం బరువు కేవలం 4 గ్రాములు మాత్రమే.
ఇందులో టచ్ సెన్సిటివ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే తొలి స్మార్ట్ రింగ్. ఇది డిస్‌ప్లేతో వస్తుంది. వాస్తవానికి ఇందులో టచ్ సెన్సిటివ్ ఇంటర్ఫేస్‌తో కూడిన బిల్ట్ ఇన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే ట్యాప్ చేస్తే సమయం, స్టెప్ కౌంట్, హృదయ స్పందన రేటు, రక్తం-ఆక్సిజన్, స్లీప్ ట్రాకింగ్ గురించి సమాచారం లభిస్తుంది. ఇది స్టెప్స్, నడిచిన సమయం, నడక దూరం, కేలరీలు, వ్యాయామ డేటాతో సహా చాలా విషయాలను ట్రాక్ చేస్తుంది.
మొత్తం 20 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఎస్ఆర్08 అల్ట్రా జీపీఎస్ ట్రాకింగ్ ఫంక్షన్ వ్యాయామం మార్గాలను రికార్డ్ చేస్తుంది. డెడికేటెడ్ యాప్ ద్వారా ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ యాప్ సాయంతో వినియోగదారుడు తన ఫోన్‌లోని ట్రాక్‌ను చూసి విశ్లేషించుకోవచ్చు. యూజర్లు హెల్త్ డేటాను ట్రాక్ చేయడమే కాకుండా లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. యాప్ ద్వారా యాక్టివ్‌గా ఉండటానికి రిమైండర్లను పొందవచ్చు.
రోగ్‌బిడ్ ఎస్ఆర్ 08 అల్ట్రా స్మార్ట్ రింగ్ అనేక పరిమాణాలలో వస్తుంది. గోల్డ్, సిల్వర్, బ్లాక్ రంగుల్లో లభించే దీని ధర 89.99 డాలర్లుగా(సుమారు రూ.7,600) నిర్ణయించారు. ఇది లిమిటెడ్ ఎడిషన్ న్యూ ఇయర్ గిఫ్ట్ బాక్స్‌లో వస్తుంది. అధికారిక ఆన్ లైన్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఏడాది వారంటీ, ఫ్రీ రీప్లేస్ మెంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.