Weight loss Journey: 35 కేజీల వెయిట్ తగ్గిన యువకుడు.. ఫాలో అయిన సౌత్‍ఇండియన్ డైట్ ప్లాన్ ఇదే!
Weight loss Journey: ఓ యువకుడు 105 కేజీల నుంచి 70 కేజీల బరువుకు వచ్చాడు. ఈ విషయాన్ని ఇన్‍స్టాగ్రామ్‍లో వెల్లడించాడు. తాను ఫాలో అయిన డైట్‍ను కూడా పూర్తిగా షేర్ చేసుకున్నాడు.
తమ వెయిట్ లాస్ జర్నీని చాలా మంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల ఈ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. తాను 35 కేజీల బరువు తగ్గానంటూ జితిన్ వీఎస్ అనే యువకుడు తాజాగా వెల్లడించారు. 105 కేజీల బరువు నుంచి 70 కేజీలకు తగ్గానంటూ తన ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. తన డైట్ ప్లాన్‍ను పూర్తిగా వెల్లడించారు.
సౌత్ఇండియన్ డైట్ ప్లాన్ అంటూ..
105 కేజీల నుంచి 35 కేజీలకు.. సౌత్ఇండియన్ డైట్ ప్లాన్ అంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ వీడియో పోస్ట్ చేశారు జితిన్ వీఎస్. కొవ్వును తీవ్రంగా కరిగించేందుకు తన డైట్ ప్లాన్ తీసేసుకోండి అంటూ షేర్ చేశారు. తాను రోజులో ఏం తింటున్నానో పూర్తి ప్లాన్‍ను షేర్ చేశారు. సౌత్‍ఇండియన్ డైట్ ప్లాన్ అంటూ పేరు పెట్టాడు. ప్రతీ భోజనానికి ఆప్షన్లు కూడా పెట్టుకున్నారు. ఆ వివరాలు ఇవే..
జితిన్ షేర్ చేసిన తన డైట్ ప్లాన్ ఇదే
ఉదయం 6:30 గంటలకు: ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగడం
ఆప్షనల్: చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ
ఉదయం 8:00 గంటలకు బ్రేక్‍ఫాస్ట్:
ఆప్షన్ 1 - రెండు ఉడికించిన కోడిగుడ్లు (12 గ్రాముల ప్రోటీన్), సాంబార్ (4-5 గ్రాముల ప్రోటీన్)తో 2 చిన్న ఇడ్లీలు.
ఆప్షన్ 2 - ఓ కప్పు పెసర పప్పు మొలకెత్తిన విత్తనాల సలాడ్ (15 గ్రాముల ప్రోటీన్), ఓ దోశ.. చట్నీతో (5 గ్రాముల ప్రోటీన్)
ఉదయం 11:00 గంటలకు మిడ్ మార్నింగ్ స్నాక్: ఓ కప్పు మజ్జిగ (3-4 గ్రాముల ప్రోటీన్), ఓ గుప్పెడు కాల్చిన వేరుశనగలు (7 గ్రాముల ప్రోటీన్)
మధ్యాహ్నం 1:00 గంటలకు లంచ్:
ఆప్షన్ 1: ఒక కప్పు బ్రౌన్ రైస్ లేదా చిరుధాన్యాలతో చేసిన అన్నం, ఓ కప్పు పప్పు లేదా సాంబార్ (10 గ్రాముల ప్రోటీన్), కొబ్బరితో కలిపి వేయించిన ఒక కప్పు కూరగాయలు, 100 గ్రాముల గ్రిల్డ్ చికెన్ లేదా చేప (25 గ్రాముల ప్రోటీన్)
ఆప్షన్ 2 (వెజిటేరియన్): చికెన్, చేపల స్థానంలో 100 గ్రాముల పనీర్ లేదా టోఫు (20-25 గ్రాముల ప్రోటీన్).
సాయంత్రం 4:00 గంటలకు స్నాక్: చక్కెర లేకుండా ఓ కప్పు గ్రీన్ టీ లేదా ఒక కప్పు మసాలా చాయ్, 2 ఉడికించిన గుడ్ల వైట్ లేదా గుప్పెడు వేయించిన శనగలు (8 గ్రాముల ప్రోటీన్)
రాత్రి 7:00 గంటలకు డిన్నర్:
ఆప్షన్ 1: ఒక కప్పు చిరుధాన్యాలతో చేసిన దోశ లేదా గోధుమ దోశ, ఒక కప్పు పాలకూర లేదా మునగకాయ సూప్ (5 గ్రాముల ప్రోటీన్), 100 గ్రాముల గ్రిల్డ్ ఫిష్ లేదా చికెన్ (25 గ్రాముల ప్రోటీన్).
ఆప్షన్ 2 (వెజిటేరియన్): 2 మల్టీగ్రెయిన్ రోటీలతో ఒక కప్పు పప్పు లేదా రాజ్మా కర్రీ (12-15 గ్రాముల ప్రోటీన్).
రాత్రి 9:00 గంటలకు: ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు, ఒక టీస్పూన్ ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగడం (8 గ్రాముల ప్రోటీన్)
ఈ జాగ్రత్తలు
తన డైట్ పంచుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు చెప్పారు జితిన్. డీప్ ఫ్రై చేసిన, ఎక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్స్ తినకూడదని అన్నారు. తాను చేసుకునే వంటకాల్లో నెయ్యి, కొబ్బరినూనె చాలా తక్కువ వాడానని తెలిపారు. తిన్న ప్రతీసారి 10 నుంచి 15 నిమిషాలు నడవడం వల్ల జీర్ణం మెరుగ్గా అయి, బరువు తగ్గేందుకు సహకరిస్తుందని తెలిపారు. సరిపడా నీరు తాగుతూ రోజంతా హైడ్రేటెడ్‍గా ఉండాలని సూచించారు.
గమనిక: ఇది ఓ వ్యక్తి తన వెయిట్ లాస్ జర్నీ, డైట్ గురించి చెప్పిన విషయాల ఆధారంగా రూపొందించిన కథనం. ప్రతీ ఒక్కరి శారీరక, ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. అందుకే బరువు తగ్గేందుకు మీకు తగ్గట్టుగా డైట్, వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవాలి. అవసరమైతే సంబంధిత నిపుణుల సలహా తీసుకోవాలి.