Kakinada Tiger: కాకినాడ జిల్లాలో పులి కలకలం.. ఏడాదిన్నర తర్వాత మళ్లీ జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి-tiger panic in kakinada district a large tiger re entered the district after a year and a half ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kakinada Tiger: కాకినాడ జిల్లాలో పులి కలకలం.. ఏడాదిన్నర తర్వాత మళ్లీ జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి

Kakinada Tiger: కాకినాడ జిల్లాలో పులి కలకలం.. ఏడాదిన్నర తర్వాత మళ్లీ జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి

Kakinada Tiger: కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. ఏడాదిన్నర క్రితం ఏజెన్సీ ప్రాంతాలను వణికించిన పులి మళ్లీ జిల్లాలో అడుగుపెట్టింది. విశాఖ ఏజెన్సీ మీదుగా తూర్పు గోదావరి చక్కర్లు కొడుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పులి మళ్లీ జిల్లాలో సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాకినాడ జిల్లాలో గుర్తించిన పులి పాద ముద్రలు

Kakinada Tiger: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పులి జాడ కలకలం రేపుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో బురద కోట పంచాయతీ పరిధి బాపన్నధార గ్రామ శివార్లలో ఆవుదూడను పులి వేటాడింది. పులి పాద ముద్రలతో దాడి చేసింది పులేనని జిల్లా అటవీ అధికారులు ధృవీకరించారు. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత జిల్లాలో మళ్లీ పులి అడుగు పెట్టడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ప్రత్తిపాడు మండలం బాపన్నధారలో వులి పాదముద్రలను గుర్తించినట్టు జిల్లా అటవీ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పాద ముద్రల ఆధారంగా పులిని నిర్ధారించినట్టు పేర్కొన్నారు. బాపన్న ధార అటవీ ప్రాంతంలో శనివారం గ్రామానికి చెందిన ముర్ల వెంకట్రావు, దుర్గాప్రసాద్లు పశువుల మందను మేపుతుండగా పశువులు పరుగులు తీయడంతో పులి వేటాడుతోందని భావించి సమీపంలోని తండాలోకి పశువులతో సహా వెళ్లిపోయారు.

ఈ క్రమంలో ఓ ఆవుదూడను పులి వేటాడింది. దీంతో ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దూడను చంపిన ప్రదేశంలో ట్రాప్ కెమెరాలు అమర్చారు. వాటిలో పులి జాడ కనిపించలేదు. అయితే దూడను వేటా డిన ప్రదేశంలో ఉన్న పాదముద్రలను పరిశీలించిన నిపుణులు, అవి పులివేనని గుర్తించారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో పులి సంచ రిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డివిజినల్ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కోరారు. పశువుల కాపారులు మేత కోసం జీవాలను అడవుల్లోకి పంపవద్దని, జనం గుంపులుగానే సంచరించాలని సూచించారు.

మండలంలోని పెద్దిపాలం గ్రామానికి 15 కి.మీ. దూరంలో కొండలపై తోటల్లో పులి అడుగుజాడల్ని దాని పాదముద్రల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. దూడను చంపిన ప్రదేశంలోనే పులి పాదముద్రలు బురదలో స్పష్టంగా నమోదయ్యాయి. పులి జాడ కోసం ట్రాప్‌ కెమెరాల్లో మాత్రం దానిని గుర్తించలేకపోయారు.

మండలంలోని ధారపల్లి, కొండపల్లి, బాపన్నధార, బురదకోట, వంతాడ, కొండతిమ్మాపురం, లింగంపర్తి, పొదురుపాక, పాండవులపాలెం, తాడువాయి, పెదమల్లాపురం, వేళంగి, అనుమర్తి, ఆవెల్తి, ఓండ్రేగుల గ్రామాలను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాలలో పులి సంచరించవచ్చని అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత ఏడాది కూడా ఆహారం కోసం పులి సంచరించింది. పోలవరం ఎడమ గట్టు మీదుగా సంచరిస్తూ పలు గ్రామాల్లో పులి పశువులపై దాడి చేసింది. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఆ తర్వాత దాని అచూకీ దొరకలేదు.

పులి సంచారంపై జిల్లా కలెక్టరు షాన్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంతాపాటిల్ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొండలపై ఉన్న బురదకోట పంచాయతీలో బాపన్నధార, కె.మిర్రివాడ, కొండపల్లి, బురదకోట గ్రామాలు ఉండగా దిగువనే ధారపల్లి జలపాతం ఉంది. పులి వ్యవహారం కొలిక్కి వచ్చేవరకు సందర్శకులు జలపాతం దగ్గరకు రావొద్దని ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు సూచించారు.

ప్రత్తిపాడు ప్రాంతం సబ్‌ డివిజన్‌‌లో విశాఖ ఏజెన్సీలతో కలిసే ఉంటుంది. 2022, 23లో కూడా బెంగాల్ టైగర్ ఈ ప్రాంతాల్లో రోజుల తరబడి సంచరించి వెళ్లింది. రాజవొమ్మంగి ప్రాంతం, కుంతీదేవివాకల్లో అలజడి రేపిన వ్యాఘ్రమే మళ్లీ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. జతను వెదుక్కుంటూ అప్పట్లో పులి సంచరించిందని అటవీ శాఖ అధికారులు భావించారు. ఆ తర్వాత ఎవరికి హానీ చేయకుండానే పులి కనుమరుగైంది. మళ్లీ ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మళ్లీ పులి కలకలం రేపుతోంది.