Smartphones Kids: వయసును బట్టి పిల్లలను ఎంతసేపు మొబైల్ వాడనివ్వొచ్చు? పెద్దలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలివి
Kids Smartphones Usage: పిల్లలు ఎట్టిపరిస్థితుల్లో ఫోన్ ఎక్కువగా వాడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీన్‍టైమ్ ఎక్కువైతే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఏ వయసు పిల్లలను ఎంత టైమ్ ఫోన్ వాడేందుకు అనుమతించవచ్చో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.
ఇటీవలి కాలంలో చాలా మంది పిల్లలు విపరీతంగా స్మార్ట్‌ఫోన్లు వాడేస్తున్నారు. పెద్దల నుంచి మొబైల్స్ తీసుకొని మరీ గంటల పాటు వాటిలో మునిగిపోతున్నారు. గేమ్స్ ఆడడం, వీడియోలు చూడడం ఇలా రోజులో చాలాసేపు ఫోన్ వాడుతున్నారు. అయితే, పిల్లలు ఎక్కువగా మొబైల్ వినియోగిస్తే చాలా రకాలుగా దుష్ప్రభావాలు ఉంటాయి. మానసికంగా, ఆరోగ్యపరంగా కూడా ఇది మంచిది కాదు.
అలవాటైన తర్వాత ఫోన్ ఇవ్వనంటే పిల్లలు మారాం చేస్తుంటారు. దీంతో తప్పక తల్లిదండ్రులు కూడా ఇచ్చేస్తుంటారు. అయితే, వయసును బట్టి పరిమిత సమయమే పిల్లలకు మొబైల్స్ ఇవ్వాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్కువ సమయం ఫోన్లలో గడపకుండా చూసుకోవాలి. ఏ వయసు పిల్లలు ఎంత సేపు ఫోన్ వాడితే పర్లేదో ఇక్కడ చూడండి.
రెండేళ్ల వరకు అసలు వద్దు
రెండేళ్ల వయసులోపు ఉన్న పిల్లలకు అసలు మొబైల్స్ ఇవ్వకూడదు. వారికి స్క్రీన్‍టైమ్ అసలు ఉండకూడదు.ఇందుకోసం పెద్దలు కొన్ని జాగ్రత్తలు వహించాలి. వారితో ఉన్నప్పుడు మీరు ఫోన్లు వాడకూడదు. వారు ఏడుస్తుంటే ఫోన్ పట్టించకూడదు. పిల్లలకు ఫోన్ అలవాటు కాకుండా పెద్దలే జాగ్రత్త పడాలి.
వీరికి గంట పాటు..
రెండేళ్ల నుంచి ఏడేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు రోజులో గంటపాటు మొబైల్ వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వొచ్చు. అది కూడా పిల్లల వికాసానికి తోడ్పడేలా ఉండేలా చూసుకోవాలి. గేమ్‍లు, వీడియోలు చూసేందుకు అతిగా అలవాటు పడకుండా పెద్దలు జాగ్రత్త పడాలి.
రెండు గంటల వరకు..
ఎనిమిదేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు రోజులో రెండు గంటల పాటు ఫోన్ వాడేందుకు అవకాశం ఇవ్వొచ్చు. అయితే, వారు మొబైల్‍ను ఎందుకు వినియోగిస్తున్నారో.. ఏం వాడుతున్నారో అనేది పెద్దలు నిరంతరం పర్యవేక్షించాలి. ఏదైనా పొరపాటుగా అనిపిస్తే సరిదిద్దుకునేలా ఆరంభంలోనే చెప్పాలి.
పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడితే ఈ సమస్యలు
- ఎదిగే వయసులో పిల్లలు మొబైల్ ఎక్కువగా వినియోగిస్తే చాలా రకాలు సమస్యలు ఉంటాయి. శారీరకంగా, మానసికంగా ప్రభావం పడుతుంది. మొబైల్ స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల కంటి చూపు దెబ్బ తినే రిస్క్ ఉంటుంది. తలనొప్పి, కళ్ల నొప్పి లాంటివి వస్తాయి. మెలటోనిన్ ఉత్పత్తి తగ్గి నిద్ర కూడా సరిగా పట్టకపోవచ్చు.
- మొబైల్‍లో ఎక్కువసేపు మునిగిపోతే అందరిలో పిల్లలు కలువలేరు. మాట్లాడే నైపుణ్యం కూడా అంతగా పెరగకపోవచ్చు. కమ్యూనికేషన్ విషయంలో ప్రభావం పడుతుంది.
- గంటల పాటు మొబైల్ పట్టుకొని ఒకే చోట కూర్చుంటే పిల్లలకు శారీరక శ్రమ తగ్గుతుంది. దీనివల్ల ఫిట్‍నెస్ సరిగా ఉండదు. ఊబకాయం సమస్య వచ్చే రిస్క్ ఉంటుంది. పిల్లల్లో ఊబకాయం వస్తే భవిష్యత్తులో ఆరోగ్యంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
- ఫోన్ ఎక్కువగా వినియోగిస్తే పిల్లలు ఒంటరితనంగానూ ఫీల్ అవుతారు. ఆందోళన పెరిగే రిస్క్ ఉంటుంది. పిల్లల మానసిక ఆరోగ్యానికి మొబైల్ వాడకం చాలా చేటుగా ఉంటుంది. అలాగే, కొన్ని రకాల కంటెంట్ పిల్లల మనసులపై, వారి అలవాట్లపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఫోన్ ఎక్కువగా వాడితే చదువుపై కూగా నెగెటివ్ ప్రభావం ఉంటుంది. జ్ఞాపకశక్తి తగ్గే రిస్క్ ఉంటుంది.
పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పిల్లల ముందు పెద్దలు ఫోన్ వాడకాన్ని బాగా తగ్గించాలి. వారి ముందు వాడకపోవడమే మంచిది. దీనివల్ల పిల్లలకు కూడా ఫోన్ అలవాటు కాదు.
- ఒకవేళ మొబైల్ కోసం చిన్నారులు మారాం చేస్తే.. దీనివల్ల కలిగే దుష్ప్రభావాల గురించి చెప్పాలి. పిల్లలకు అర్థం కాదని చాలా మంది అనుకుంటారు. అయితే, వివరంగా చెబితే ఎక్కువ శాతం పిల్లలు వింటారు.
- ఒకవేళ మొబైల్ ఇచ్చినా పిల్లలు ఎందుకు వినియోగిస్తున్నారో, ఏ యాప్స్ వాడుతున్నారో, ఏం చూస్తున్నారో నిరంతరం గమనించాలి. తల్లిదండ్రులు వీటిని ట్రాక్ చేసేందుకు కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి.
- పిల్లలు ఏవైనా హాబీలు అలవాటు చేసుకునేలా ఇంట్రెస్ట్ కలిగించాలి. ముఖ్యంగా పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువగా చేయాలి. డ్రాయింగ్, సంగీతం సహా ఏవైనా నేర్పించాలి. ఔట్‍డోర్ గేమ్స్ ఆడేందుకు ప్రోత్సహించాలి.